
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి..భారత్‌ను వణికిస్తోంది. దేశంలో కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య అంత కంతకూ పెరుగుతుండగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 2వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇక మహారాష్ట్రలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు, మరణాలు ఆ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలను పరిశీలించినట్లయితే…
ఏపీలో కరోనా ఉధృతి తగ్గటం లేదు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,177కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదైనట్లు సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో కృష్ణా జిల్లాలో 33 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరుకుంది. గుంటూరు జిల్లాలో 23 కేసులు నమోదై ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 237కు చేరింది. కర్నూలులో కొత్తగా 13 కేసులు రావడంతో మొత్తం 292 కేసులతో రాష్ట్రంలో అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా నమోదైంది. మొదటి స్థానంలో ఉంది. నెల్లూరు జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 1 కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో మరో నలుగురు కరోనా నుంచి కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 235కి చేరింది.
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. సోమవారం కొత్తగా కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1003కు చేరింది. రాష్ట్రంలో ఇంత వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 25 కాగా కరోనా సోకి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 332. సోమవారం 16 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 646. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో కోవిడ్ శాంతించినట్లుగానే తెలుస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే, త్వరలోనే సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలబడుతుందనే అభిప్రాయం వ్యక్తం మవుతోంది