రాష్ట్రవ్యాప్తంగా కరోనా విస్తరణ పెరుగుతోన్న నేపథ్యంలో.. దాన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కరోనా ప్రభావంతో చాలా దేశాల్లో అల్లకల్లోలం నెలకొనిందని ఆయన అన్నారు. కేవలం లాక్‌డౌన్ ప్రకటించినంత మాత్రాన వ్యాధిని కట్టడి చేయలేమని బాబు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం యుద్ధ ప్రాతిపదికన పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమయంలో ప్రతి పేద కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.5 వేలు తక్షణ సాయం చేయాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను ఆసరగా చేసుకొని కొందరు వ్యాపారులు కూరగాయల కృతిమ కొరత సృష్టిస్తున్నారన్న చంద్రబాబు.. ధరల పెరుగులను కూడా నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోకి విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని కోరారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.