Black Fungus: కరోనా మహమ్మారి ఇప్పట్లో మానవాళిని వదిలేలా లేదు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మరింత విరుచుకుపడుతోందీ మయదారి రోగం. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఈ మాయదారి రోగం ప్రజలను వదిలేలా కనిపించట్లేదు. తాజాగా బ్లాక్ ఫంగస్/మ్యుకర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరకు ఉత్తర భారతదేశానికి పరిమితమైన ఈ వ్యాధి తాజాగా తెలంగాణలో కూడా కనిపించడం గమనార్హం. దీంతో అందరిలో కలవరం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఈ వ్యాధి గురించి చెప్పుకొచ్చిన మంత్రి.. ఇటీవలి కాలంలో ఈ వ్యాధిని కొంత మంది కోవిడ్ రోగుల్లో గుర్తించామని చెప్పుకొచ్చారు. మొదట్లోనే రోగ నిర్ధారణతో ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చని హర్ష వర్ధన్ సూచించారు. ఈ వ్యాధి అంతకు ముందు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పిన మంత్రి.. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్నారు.
* చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోంది.
* కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు.
* ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది వెలుగుచూస్తోంది.
* కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు.
* అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు చెబుతున్నారు.