చైనాలో సెకండ్ కొవిడ్-19 వేవ్ తలెత్తిందని వార్తలు వస్తున్న వేళ.. ఏకంగా రాజధాని బీజింగ్ నగరమే ఇప్పుడు వీటిని ధృవీకరిస్తూ.. హడలెత్తిపోతోంది. మా సిటీలో కోవిడ్-19 పరిస్థితి తీవ్రంగా ఉందని ఈ సిటీ ప్రతినిధి జూ హెజియన్ ప్రకటించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన హెజియన్.. ఈ వైరస్ ని వ్యాప్తి చెందకుండా నివారించడం తమకు ఎంతో ముఖ్యమని, దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని చెప్పారు. బీజింగ్ లోనే సోమవారం కొత్తగా 27 ఇన్ఫెక్షన్లు సోకిన విషయాన్ని ప్రస్తావించారు. ఆసియాలోనే అతిపెద్దదైన జిన్ పాధీ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ లో ప్రారంభమైన కరోనా వైరస్ మెల్లగా ‘జడలు విప్పుతోంది’. గత 5 రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 106 కి పెరిగింది. 30 చోట్ల అధికారులు లాక్ డౌన్ విధించారు. వేలమందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పుడే బీజింగ్ లో తలెత్తిన ఈ క్లస్టర్ పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నగరంలోని ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావించింది. కాగా- నగరంలో రోజుకు 90 వేల కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ సిన్ హువా దీన్ని ధృవీకరించింది.
మంగళవారం బీజింగ్ లో టాక్సీ సర్వీసులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నగరం విడిచి వెళ్లరాదని డ్రైవర్లను, ప్రజలను హెచ్చరించింది. సిటీలోని అన్ని ఫుడ్ మార్కెట్లు, రెస్టారెంట్లు, ఇతర హోటళ్ల యజమానులకు, మేనేజర్లకు కరోనా టెస్టుల నిర్వహణను తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా అప్పుడే స్పోర్ట్స్, వినోద కేంద్రాలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. హుబె ప్రావిన్స్ లో నాలుగు కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్టు నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. బీజింగ్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి వఛ్చినవారు తక్షణమే అధికారులకు రిపోర్ట్ చేయాలనీ, కరోనా టెస్టులు చేయించుకోవాలని, ఏ మాత్రం పాజిటివ్ లక్షణాలు కనబడినా వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.