మహారాష్ట్రలోని పూణేలో ఇదో విషాదం,.. ఇక్కడి పింప్రి చించివాడ ప్రాంతంలో ఓ మహిళ మరణించింది. ఆమె మృత దేహం పక్కనే 18 నెలల చిన్నారి ఏడుస్తూ కనిపించాడు. బహుశా ఆ మహిళ కోవిడ్ తో మరణించి ఉండవచ్చునని భావించిన స్థానికులు ఎవరూ ఆ ఛాయలకైనా రాలేదు. కనీసం నోరు లేని ఆ చిన్నారి రోదన కూడా వారిని కదిలించలేక పోయింది. చుట్టుపక్కలవారిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి చూస్తే ఈ హృదయ విదారక దృశ్యం కనిపించింది. రెండు రోజులుగా పాలుగానీ, నీరు గానీ లేక ఆ చిన్నారి నీరసించిపోయాడు. మహిళా కానిస్టేబుల్స్ ఇద్దరు ఆ బాలుడికి పాలు, బిస్కట్లు ఇచ్చి వాడి ఆకలి తీర్చారు. ఆ తరువాత ఆసుపత్రికి తీసుకువెళ్లి కోవిడ్ టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. స్వల్ప జ్వరం మాత్రమే ఉందని, ఆ చిన్నారికి ఇంకే సమస్య లేదని పోలీసులు తెలిపారు. ఆ బాలుడిని ప్రభుత్వ సంరక్షణ కార్యాలయానికి తరలించారు. ఇతడి తండ్రి ఉపాధి కోసం యూపీకి వెళ్లినట్టు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. అతడు ఎప్పుడు వస్తాడో.. వచ్చిన వెంటనే అతనికి ఈ బిడ్డను ఇస్తామని వారు చెప్పారు.
మహారాష్ట్రలో కోవిడ్ వికటాట్ట హాసం చేస్తోంది. గత 24 గంటల్లో 67 వేలకు పైగా కోవిద్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక వ్యాక్సిన్ కొరత కూడా తీవ్రంగా ఉండడంతో కేసులు మరింత పెరగవచ్చునని భావిస్తున్నారు.
Also Read: మళ్ళీ మరో సంచలనం… ! ముంబై మాజీ పీసీ పరమ్ బీర్ సింగ్ మరో లెటర్ ‘బాంబ్ ‘.. ఈ సారి ఎవరి పైనంటే ?