Breast Milk: కరోనా మహమ్మారి మానవ సమాజానికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. ప్రపంచం ఎప్పుడూ కనివినీ ఎరగని ఈ మాయదారి రోగానికి చిగురుటాకులా వణికిపోయింది. ఇక కరోనా వ్యాధి సోకిన తర్వాత కలిగే దుష్ఫ్రభావాలపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి, తగ్గిన వారిలో ఇంకా కొన్ని దీర్ఘకాలిక లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా మెక్సికోలో ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. మెక్సికాకు చెందిన 23 ఏళ్ల అన్నా కార్టేజ్ అనే మహిళకు గత జనవరిలో కరోనా సోకింది. కార్జేజ్‌కు ఒక చిన్నారి కూడా ఉంది. అయితే ఈ సమయంలో కరోనా సోకిన కొన్ని రోజులకు ఆమె తన చనుబాలు ఆకుపచ్చ రంగులోకి మారడాన్ని గమనించింది. అయితే కరోనా నెగిటివ్‌గా వచ్చిన తర్వాత చనుబాలు మళ్లీ మాములు రంగుకు మారాయి. దీంతో ఆందోళన చెందిన అన్నా కార్జేజ్ వైద్యులను సంప్రదించింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న పీడియాట్రిక్‌లు అన్నా కార్జేట్ చనుబాలను పరీక్షించి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. ఇక చనుబాల రంగు మారడానికి గల కారణాన్ని వివరిస్తూ.. కరోనా సోకిన సమయంలో వైరస్‌తో పోటీపడడానికి తన శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీ బాడీలే దీనికి కారణమని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా తల్లి ఏదైనా కారణంతో జబ్బున పడ్డ సమయంలో యాంటీ బాడీల వల్ల చనుబాల రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కరోనా ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఉపయోగించే ఔషధాలు, ఆకు కూరలు ఎక్కువ తీసుకోవడం కూడా ఓ కారణమని భావిస్తున్నారు.
ఇక సైకాలజీ చదువుతోన్న అన్నా.. ఇతర తల్లులు కూడా చనుబాల రంగు మారినట్లు తనకు తెలిపారని చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయమై ఇంపీరియల్ కాలేజ్ లండన్, హూమన్ మిల్క్ ఫౌండేషన్ కో ఫౌండర్ డాక్టర్ నాటాలీ శంకర్ మాట్లాడుతూ.. కరోనా సోకి తగ్గిన మహిళల్లో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని, ఆ యాంటీ బాడీలు సుమారు 90 శాతం కేసుల్లో తల్లుల చనుబాలల్లోకి చేరినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. కాబట్టి కరోనా జయించిన తల్లుల చనుబాల రంగులో మార్పులు వచ్చినా ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు తల్లి పాలను మించిన మంచి ఔషధం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
Ram Pothineni : శరవేగంగా ఇస్మార్ హీరో నయా మూవీ షూటింగ్.. వినాయక చవితికి సర్‌ప్రైజ్ ఉండనుందా మరి..?