
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వందలోనే కేసులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,909కి చేరింది. ఈ విషయాన్ని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదిలావుంటే.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది తప్ప.. తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కరోనా 11 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3.20 లక్షలకు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 311 మంది కరోనా బారినపడి మరణించారని.. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి ఇప్పటి వరకు 9,195 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.