AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేస్తున్న జాబ్‌ను పట్టుకుని వేలాడుతున్నారా? ప్రమాదంలో ఉన్నట్టే.. ఆఫీసుల్లో స్టార్ట్ అయిన కొత్త ట్రెండ్

గత రెండు మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ‘గ్రేట్ రెసిగ్నేషన్’, ‘క్వైట్ క్విటింగ్’ వంటి పదాలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపించాయి. మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలు వదిలేయడం లేదా ఉన్న చోటే తక్కువ పని చేయడం వంటివి అప్పట్లో ట్రెండ్ అయ్యాయి. కానీ, 2026 నాటికి గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఒక కొత్త రకమైన మార్పు కనిపిస్తోంది. దానినే నిపుణులు ‘జాబ్ హగ్గింగ్’ అని పిలుస్తున్నారు.

చేస్తున్న జాబ్‌ను పట్టుకుని వేలాడుతున్నారా? ప్రమాదంలో ఉన్నట్టే.. ఆఫీసుల్లో స్టార్ట్ అయిన కొత్త ట్రెండ్
Job Hugging.jpg
Nikhil
|

Updated on: Apr 17, 2026 | 8:56 PM

Share

జాబ్ హగ్గింగ్ పైకి చూడటానికి ఎంతో సురక్షితంగా, బాధ్యతాయుతంగా అనిపించినప్పటికీ.. లోలోపల ఒక ఉద్యోగి ఎదుగుదలను నిశ్శబ్దంగా అడ్డుకుంటూ, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. అసలు ఏంటీ జాబ్ హగ్గింగ్? దీనివల్ల వచ్చే నష్టాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

భయంతో కూడిన విధేయత

జాబ్ హగ్గింగ్ అంటే మనకు నచ్చిన ఉద్యోగాన్ని ఇష్టంతో చేయడం కాదు. జీతాలు పెరగకపోయినా, ఆఫీసులో వాతావరణం విషతుల్యంగా ఉన్నా, వ్యక్తిగతంగా ఎటువంటి సంతృప్తి లేకపోయినా కేవలం భయం వల్ల ప్రస్తుత పొజిషన్‌ను గట్టిగా పట్టుకుని వేలాడటమే జాబ్ హగ్గింగ్. కంపెనీలలో ఎప్పుడు లే-ఆఫ్స్ జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో.. ‘చివరగా చేరిన వారే మొదట బయటకు వెళ్తారు’ అనే నిబంధనకు భయపడి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉన్న చోటే ఉండిపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఇలాంటి వారు తమ ఆశయాలను చంపుకుని, అందరిలో కలిసిపోకుండా చాలా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు.

నైపుణ్యాల క్షీణత..

కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చినప్పుడే మనిషిలో ఎదుగుదల కనిపిస్తుంది. కానీ జాబ్ హగ్గింగ్ చేసే వారు కొత్త సవాళ్లను స్వీకరించడానికి, కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఒకే చోట ఏళ్ల తరబడి కొత్త నైపుణ్యాలు నేర్చుకోకుండా ఉండిపోవడం అంటే కెరీర్ పరంగా వెనక్కి వెళ్తున్నట్లే లెక్క. మారుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్ చేసుకోకపోతే మార్కెట్‌లో మనకు ఉండే విలువ పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఉద్యోగం కోల్పోవాల్సి వస్తే.. బయట మరో కొత్త అవకాశం దక్కించుకోవడం చాలా కష్టమవుతుంది.

సృజనాత్మకతపై దెబ్బ

గణాంకాల ప్రకారం ఒక కంపెనీలో ఎక్కువ కాలం ఉండిపోయేవారి కంటే, ప్రతి రెండు నుండి నాలుగు ఏళ్లకు ఒకసారి సంస్థలను మార్చే ప్రొఫెషనల్స్ జీతాలు భారీగా పెరుగుతున్నాయి. యజమానులకు కూడా తమ ఉద్యోగి ఎక్కడికీ వెళ్లడు అని నమ్మకం కలిగినప్పుడు భారీగా జీతాలు పెంచాలనే ఉత్సాహం చూపరు. దీనిని ‘లాయల్టీ డిస్కౌంట్’ అని పిలుస్తారు. అంటే మీ విధేయతకు మీరు చెల్లిస్తున్న మూల్యం అన్నమాట. దీనివల్ల దీర్ఘకాలంలో లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా భయంతో పని చేయడం వల్ల మెదడులో సృజనాత్మకత నశిస్తుంది. ఇది క్రమంగా ఆందోళన ఇంకా అసంతృప్తికి దారితీసి పనితీరును దెబ్బతీస్తుంది.

దీనికి పరిష్కారం కేవలం ఉద్యోగాన్ని కాపాడుకోవడం మీద కాకుండా.. మనల్ని మనం ఎప్పుడూ ‘ఎంప్లాయబుల్’ (ఉద్యోగానికి అర్హులుగా) ఉంచుకోవడం మీద దృష్టి పెట్టాలి. అంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తిగా ఉన్నప్పటికీ, బయట మార్కెట్‌లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మనకు ఎలాంటి విలువ ఉంది అనేది అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. నిశ్శబ్దంగా ఉండే భయం కంటే.. నిరంతరం నేర్చుకునే తపనే మన కెరీర్‌కు అసలైన భద్రతను ఇస్తుంది. జాబ్ హగ్గింగ్ అనే భయం నుండి బయటపడి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయడమే నేటి కార్పొరేట్ ప్రపంచంలో అత్యవసరం.

Follow Us