
హైదరాబాద్, మార్చి 6: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాలు ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 958 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇందులో జనరల్ కేటగిరీ నుంచి 317 మంది ఉండగా.. ఈడబ్ల్యూఎస్ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది చొప్పున ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. అయితే తాజా ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు అభ్యర్ధులు సత్తా చాటారు. ముఖ్యంగా సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
సింగరేణి సంస్థ అధ్వర్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయ్యారు. వీరిలో ఏకంగా 20 మంది సివిల్స్ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజేతలుగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని కమిషన్ పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.