UPSC Civil Services New Rules: సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు యూపీఎస్సీ కొత్త రూల్స్.. ఇకపై అలా చేస్తే వేటు తప్పదు!

గతేడాది సంచలనం సృష్టించిన మాజీ ఐఏఎస్‌ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌ కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. తప్పుడు ఓబీసీ, మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించి దివ్యాంగుల కోటాలో ఐఏఎస్‌కు ఎంపికైనట్లు తేలడంతో ఆమెను యూపీఎస్సీ బోర్డు డీబార్‌ చేస్తూ ప్రకటన జారీ చేసింది కూడా. ఈ నేపథ్యంలో కమిషన్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది..

UPSC Civil Services New Rules: సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులకు యూపీఎస్సీ కొత్త రూల్స్.. ఇకపై అలా చేస్తే వేటు తప్పదు!
UPSC Civil Services New Rules

Updated on: Jan 26, 2025 | 7:53 AM

హైదరాబాద్‌, జనవరి 26: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2025 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి సివిల్స్‌అభ్యర్థులకు కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే సమయంలో అభ్యర్ధుల వయసు, రిజర్వేషన్‌ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని హుకూం జారీ చేసింది. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించిన కొత్త నోటిఫికేషన్‌లో కూడా పేర్కొంది. గతంలో ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాతనే అభ్యర్థుల వయసు, రిజర్వేషన్‌ ధ్రువీకరించే పత్రాలు సమర్పించేవారు. గతేడాది మాజీ ఐఏఎస్‌ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌ కేసులో తప్పుడు ఓబీసీ, మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించి కొలువు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె దివ్యాంగుల కోటాలో ఐఏఎస్‌కు ఎంపికైనట్లు తేలడంతో ఆమెను డీబార్‌ చేస్తూ యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

జనవరి 22న విడుదలైన సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ రూల్స్‌-2025 ప్రకారం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్‌లో పుట్టిన తేదీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికుల వివరాలు, విద్యార్హతలు, సర్వీస్‌ ప్రిఫరెన్స్‌లను పేర్కొనాలని స్పష్టం చేసింది. అలాగే వాటిని రుజువు చేసే పత్రాలను కూడా కచ్చితంగా అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. ఒకవేళ దరఖాస్తుతోపాటు ఈ పత్రాలు సమర్పించని పక్షంలో అభ్యర్థిత్వం రద్దు చేస్తామని కమిషన్‌ స్పష్టం చేసింది.

కాగా ఈ ఏడాది సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 979 పోస్టులను ఈసారి భర్తీ చేయనుంది. ఇందులో దివ్యాంగులతోపాటు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుంది. యూపీఎస్సీ వైబ్‌సైట్‌లో ఫిబ్రవరి 11, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.