
హైదరాబాద్, నవంబర్ 10: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2025 (యూజీసీ నెట్)కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తుల సవరణకు అవకాశాన్ని కల్పిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. ప్రకటన వెలువరించింది. యూజీసీ నెట్ డిసెంబర్ 2025 పరీక్షకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే సవరించుకోవచ్చని తన ప్రకటనలో తెలిపింది. అభ్యర్ధులు నవంబర్ 12 వరకు తమ అప్లికేషన్‌లో ఉన్న తప్పులను కరెక్షన్ విండో ద్వారా సరిచేసుకోవచ్చు.
అయితే అభ్యర్థల పేరు, జెండర్, ఫోటో, సంతకం, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామా, పరీక్ష నగరంకు సంబంధించిన వివరాలను మాత్రం సవరించుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీయే తన ప్రకటనలో స్పష్టం చేసింది. పుట్టిన తేదీ వివరాలు, కేటగిరీ, తండ్రి, తల్లి పేర్లు వంటి వివరాలు మాత్రమే సవరించడానికి అవకాశం ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది.
మరోవైపు యూజీసీ- నెట్ డిసెంబర్ 2025 రాత పరీక్షల తేదీలను కూడా ఎన్టీయే విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్ధులకు జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆయా సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. యూజీసీ ఏటా రెండు సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.
యూజీసీ- నెట్ డిసెంబర్ 2025 కరెక్షన్ విండో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.