UGC Dual Degrees: విద్యార్థులకి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తి చేయవచ్చని ప్రకటించారు. ఈ విధానం వల్ల విద్యార్థులు విద్యకి మరింత దగ్గరవుతారని తెలిపారు. ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సులు చేస్తూనే మరోవైపు నచ్చిన కోర్సు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు రెగ్యులర్ డిగ్రీతో పాటు మరొక కోర్సు దూరవిద్యలో లేదా ఆన్‌లైన్ మోడ్‌లో చేయవచ్చు. వాటి నియమ నిబంధనల గురించి వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉదయం బీకామ్ క్లాసులకు హాజరవుతూ సాయంత్రం బీఏ క్లాసులకు అటెండ్ కావచ్చు. రెండు డిగ్రీలనూ ఒకే యూనివర్సిటీ నుంచి లేదా వేర్వేరు యూనివర్సిటీల నుంచి కూడా పూర్తి చేయవచ్చు. అలాగే ఉదా. బీఏ హిస్టరీని బీఎస్సీ మ్యాథమేటిక్స్‌తో కలిపి తీసుకోవచ్చు. అలాగే బీకామ్ హానర్స్‌ని, డేటా సైన్స్‌లో డిప్లొమాతో కలిపి తీసుకుని చేయవచ్చు.
యూజీసీ చైర్మన్ ప్రకారం.. ఒకే కాలంలో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు పూర్తి చేయడానికి అవకాశం కల్పించినట్లయితే విద్యార్థులు తాము కోరిన విధంగా చదువుకోవచ్చు. దేశవ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాలు ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అందుకే నూతన విద్యావిధానంలో భాగంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలయికగా విద్యకు సంబంధించి వేర్వేరు మార్గాలను తీసుకొస్తున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు మినహాయించి ఇతర కోర్సులకు రెండు డిగ్రీల విధానం వర్తిస్తుంది.