తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ ఆర్టీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సంస్థ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆర్టీసీ ప్రచారంపై దృష్టిసారించిన అధికారులు ఇప్పుడు ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఆర్టీసీలోని ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ విషయమై అక్టోబర్ 3న తెలంగాణ ఆర్టీసీ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ విభాగాలకు బీటెక్, బీఈ చేసిన అభ్యర్థులు, నాన్ ఇంజినీరింగ్ పోస్టులకు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 16ని చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అదే వెబ్‌సైట్‌లో ఉన్న టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్ ఐడీ ద్వారా అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు సమర్పించాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రెండు రోజుల్లో www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందచేస్తామని అధికారులు తెలిపారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..