TSPSC: టీఎస్‌పీఎస్‌సీ బోర్డు నుంచి మరో సభ్యురాలు ఔట్.. గవర్నర్‌కు అందిన రాజీనామా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం (జనవరి 27) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆమె పంపారు. ఈ సందర్భంగా ఆమె ఓ లేఖను జత చేశారు. అందులో తన కెరీర్‌లో సాధించిన విజయాలు, కమిసణ్ సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాలు, రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఆ లేఖను కూడా రాజీనామా లేఖకు జత..
హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం (జనవరి 27) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆమె పంపారు. ఈ సందర్భంగా ఆమె ఓ లేఖను జత చేశారు. అందులో తన కెరీర్‌లో సాధించిన విజయాలు, కమిసణ్ సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాలు, రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఆ లేఖను కూడా రాజీనామా లేఖకు జత చేశారు. టీఎస్‌పీఎస్సీ వరుస పేపర్ లీకేజీలో ప్రత్యేక్షంగానీ, పరోక్షంగానీ సభ్యులెవరికీ ప్రమేయం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
తోటి సభ్యులందరూ రాజీనామాలు చేస్తున్నా తాను చేయలేదని, తనకు ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీతో ఎలాంటి అనుబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా, భూభారతి సర్వే డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వచ్చానన్నారు. ఏ తప్పూ చేయనప్పుడు తాను టీఎస్‌పీఎస్సీ సభ్యురాలి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, అందుకే తన పదవికి రాజీనామా చేయలేదని లేఖలో తెలిపారు. తన ఒక్కరి వల్ల ప్రభుత్వం చేపడుతోన్న కొత్త ఉద్యోగాల ప్రకటనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు భావించి, తన వల్ల ఎవరికీ అన్యాయం జరగొద్దనే తానిప్పుడు రాజీనామా చేస్తున్నట్టు ఆ లేఖలో తెలిపారు.
కాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి మహేందర్‌రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. గత గురువారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీ బోర్డులో మొత్తం 11 సభ్యుల్లో 10 స్థానాలు ఖాళీగా ఉండగా వీటిల్లో చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులను తాజాగా నియమించారు. తాజాగా కోట్ల అరుణకుమారి కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనితోపాటు సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామాను కూడా గవర్నర్ ఆమోదిస్తే 11 మంది సభ్యుల్లో ఐదుగురు మాత్రమే ఉంటారు. వీరిద్దరి స్థానాలను కలిపి ఆరుగురు సభ్యులను నియమించాల్సి ఉంటుంది. రెండు రోజుల క్రితం టీఎస్ పీఎస్సీకి కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, అమీరుల్లాఖాన్, నర్రీ యాదయ్య, వై.రాంమోహన్ రావు, పాల్వాయి రజనీకుమారిలను రేవంత్ రెడ్డిని సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. కొత్త చైర్మన్, సభ్యుల రాకతో అనూహ్యంగా అరుణ కుమారి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.