
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు త్వరలో నిర్వహించనున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా తెలంగాణ గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల కోసం జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అందులో వ్యక్తిగత వివరాల్లో ఏవైనా పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.
జూన్ 9న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సంబంధిత పరీక్ష కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. గ్రూప్ 1 పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది హాజరుకానున్నారు. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్ పరీక్షలు అక్టోబరు 21 నుంచి జరుగుతాయి. మెయిన్ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు ఉంటాయి.
టీఎస్పీయస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు, లైట్లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గట్టి నిఘా మధ్య పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధకారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అందుకు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థులను తరవుగా తనిఖీ చేసిన తరువాతే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ హాజరు విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆయా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించాక పరీక్ష సమయం పూర్తయ్యే వరకు బయటకు వెళ్లేందుకు వీలుండదు. పరీక్ష ముగిశాక ఓఎంఆర్ పత్రాన్ని తప్పనిసరిగా ఇన్విజిలేటర్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఇతర మూఖ్య సూచనలు హాల్ టికెట్‌లపై ముద్రించారు. ఈ సూచనలను అభ్యర్ధులు తప్పనిసరిగా పాటించవల్సి ఉంటుంది.