10th Class Pass: ’12th ఫెయిల్’ మనోజ్ శర్మ స్టోరీ రిపీట్.. 11వ ప్రయత్నంలో ‘టెన్త్’ పాస్!
పదో తరగతి పాస్ అవ్వడమే అతడి జీవితంలో మరపురాని ఘట్టంగా మారింది. ఏకంగా 10 ప్రయత్నాల తర్వాత అతగాడు పదో తరగతి పాస్ అయ్యాడు. వరుసగా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నా, చుట్టూ అందరూ హేళన చేస్తున్నా పట్టువదలకుండా ప్రయత్నించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఈ సందర్భాన్ని ఆ ఊరంతా పండుగగా జరుపుకుంది. ఇంకేముంది పది పాసైన వీరుడ్ని భూజాలపై ఎక్కించుకుని అతడి కుటుంబ..
ముంబై, మే 31: పదో తరగతి పాస్ అవ్వడమే అతడి జీవితంలో మరపురాని ఘట్టంగా మారింది. ఏకంగా 10 ప్రయత్నాల తర్వాత అతగాడు పదో తరగతి పాస్ అయ్యాడు. వరుసగా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నా, చుట్టూ అందరూ హేళన చేస్తున్నా పట్టువదలకుండా ప్రయత్నించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. ఈ సందర్భాన్ని ఆ ఊరంతా పండుగగా జరుపుకుంది. ఇంకేముంది పది పాసైన వీరుడ్ని భూజాలపై ఎక్కించుకుని అతడి కుటుంబ సభ్యులు ఊరంతా ఊరేగించారు. పండగలా సంబరాలు చేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని బీడ్‌లోని పర్లీ గ్రామానికి చెందిన కృష్ణనామ్‌దేవ్ ముండే అనే వ్యక్తి 2018లో పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి పది పరీక్షలు రాస్తూనే ఉన్నాడు.. ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇలా 5 సంవత్సరాల కాలంలో దాదాపు 10 సార్లు పరీక్షలు రాశాడు. చివరికి 11వ ప్రయత్నంలో అతడు గట్టెక్కాడు. ఇటీవల మహారాష్ట్రలో విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో అతడు పాసయ్యాడు. దీంతో అతడిని గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు. మేళతాళాలతో వీధుల్లో ఊరేగించారు.
కాగా పర్లి తాలూకాలోని రత్నేశ్వర్ పాఠశాలలో కృష్ణ 2018లో పదో తరగతి చదివాడు. అదే ఏడు బోర్డు పరీక్షలకు హాజరవగా టెన్త్ ఫెయిల్ అయ్యాడు. కానీ ఈసారి అన్ని సబ్జెక్టులను క్లియర్ చేశాడు. పట్టుదల, అంకిత భావంతో కష్టపడితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని మరోమారు రుజువు చేశాడు. కష్టాలకు భయపడి కలలను ఎప్పటికీ వదులుకోకూడదనడానికి కృష్ణ ఆ ఊరి ప్రజలకు స్పూర్తిగా నిలిచాడు. మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (MSBSHSE) ఫలితాలు వెలువడిన వెంటనే అతడి తండ్రి భూజాలపై ఎత్తుకుని ఊరంగా ఊరేగించాడు. గ్రామస్తులతో కలిసి డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. కృష్ణ తండ్రి నామ్‌దేవ్ మండే మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఐదేళ్లలో 10 సార్లు పదో తరగతి పరీక్షలు రాశారు. అతనికి ప్రతి అవకాశాన్ని ఇవ్వాలనుకున్నాను. అందుకే విసగకుండా పరీక్షలకు ఫీజులు కట్టానంటూ’ ఆనందం వ్యక్తం చేశాడు.
కృష్ణ విజయగాథ.. IPS అధికారి మనోజ్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ మువీ ’12th ఫెయిల్’ మాదిరిగా ఉండటంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. మనోజ్ శర్మ కూడా తన తొలి ప్రయత్నంలో 12వ తరగతిలో ఫెయిల్ అయినా.. తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్సీ క్లియర్ చేసి విజయం సాధిస్తాడు. ఈ మువీ విడుదలైన అన్ని భాషలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.