హైదరాబాద్, జులై 27: ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ తుది ఎంపిక ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఎంపిక ఫలితాల ప్రకటనకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి రంగం సిద్ధం చేసింది. కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పూర్తి చేసింది. జిల్లాలు, సామాజికవర్గాలు తదితర అంశాలను పరిగణనలోకి ఈ కసరత్తును కొలిక్కితెచ్చారు. తప్పిదాలకు ఆస్కారం లేకుండా కటాఫ్‌ల ప్రక్రియను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేస్తున్నారు. ఇది నామమాత్ర ప్రక్రియ కావడంతో ఎప్పుడైనా తుది ఫలితాలు ప్రకటించేందుకు మండలి సిద్ధంగా ఉంది.
కటాప్ ప్రకటన అనంతరం అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్ కేసులపై ఆరా తీయనుంది. గరిష్ఠంగా పది రోజుల్లోనే స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) విభాగంతో విచారణ జరపనున్నారు. అనంతరం అభ్యర్థులకు ఎంపిక లేఖలు పంపనుంది. ఆగస్టు రెండోవారంలోగా అర్హుల జాబితాను పోలీసు, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు అన్ని విభాగాలకు పంపనుంది. తొలుత ఎస్సై కొలువులకు ఆ తర్వాత కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు కటాఫ్ ప్రకటించే అవకాశం ఉంది.
కాగా రాష్ట్రంలో దాదాపు 554 ఎస్సై పోస్టుల భర్తీకి సుమారు 2.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సై ఎంపిక ఫలితాలు ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉంది. ఇక కానిస్టేబుల్ ఎంపిక ఫలితాల వెల్లడి విషయంలో మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. జీవో నం.46కు సంబంధించిన న్యాయవివాదం కోర్టులో నడుస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ జీవో రాష్ట్రప్రభుత్వంలోని 9 శాఖలకు సంబంధించిందైనా ప్రస్తుతం హోంశాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీఎస్‌ఎస్‌పీ) చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కంటీజియస్ జిల్లా కేడర్ పోస్టుల భర్తీ కోసం రూపొందించిన రేషియో కారణంగా తమకు అన్యాయం జరుగుతోందంటూ కొందరు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సై పోస్టులు కంటీజియస్ జిల్లా కేడర్ పరిధిలో లేకపోవడం వల్ల వాటి ఫలితాల వెల్లడిలో సమస్యేమీ లేదు. కానీ.. కానిస్టేబుళ్ల పోస్టులు మాత్రం ఇదే కేడర్‌లో ఉండడంతో న్యాయస్థానం తీర్పు అనంతరం మాత్రమే ఎంపిక ఫలితాలు వెలువడనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.