ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇక ఫస్ట్ ఇయర్‌లోనూ ఇంటర్నల్ మార్కుల విధానం!
ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్‌లో కొత్త పాఠ్యపుస్తకాలు, కొత్త మూల్యాంకన విధానం అమల్లోకి రానుంది. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు 20 శాతం, థియరీ పరీక్షలకు 80 శాతం మార్కులు కేటాయించారు. విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లమ్ సాల్వింగ్, సృజనాత్మకత, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యంగా బోర్డు వెల్లడించింది..

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పాఠ్యపుస్తకాలను సవరించడమే కాకుండా, కొత్త మూల్యాంకన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల్లో కేవలం సబ్జెక్టు పరిజ్ఞానమే కాకుండా ఆలోచనా శక్తిని, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించేందుకు ఈ మార్పులు చేసినట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
నూతన విద్యా విధానం ప్రకారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఇంటర్నల్ అసెస్మెంట్ కి ప్రాధాన్యతనిచ్చారు. దీనికింద 20 శాతం మార్కులను కేటాయించగా.. మిగిలిన 80 శాతం మార్కులను థియరీ పరీక్షలకు కేటాయించారు. కళాశాలలన్నీ ఈ మార్కుల కేటాయింపు మూల్యాంకనంలో పారదర్శకతను పాటిస్తూ విధానాలను సక్రమంగా అమలు చేసేందుకు వీలుగా కామన్ వాలిడేషన్ రూల్స్ మరియు ఇంటర్నల్ అసెస్మెంట్ సమాచారానికి సంబంధించిన సర్క్యులర్‌ను బోర్డు విడుదల చేసింది. అలాగే విద్యార్థులు, అధ్యాపకుల సందేహాలను నివృత్తి చేయడానికి తగిన ప్రశ్నలు-సమాధానాలను అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు.
విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన , ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, సృజనాత్మకత మరియు నిరంతర అభ్యాసాన్ని పెంపొందించడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ప్రయోగాత్మక అభ్యాసం ద్వారా చదువును మరింత సులభతరం చేసి, విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సమర్థవంతంగా సిద్ధం చేయడం కోసం ఈ నిబంధనలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలులోకి వస్తాయని వివరించింది.




