హైదరాబాద్, అక్టోబర్ 11: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) పరీక్షను వాయిదా వేలయాలంటూ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం కోరింది. ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి బుధవారం (అక్టోబరు 10) కోరారు. ప్రస్తుతం టీఆర్‌టీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబరు 21వ తేదీ వరకు కొనసాగనుండగా. తుది దరఖాస్తు గడువును మరో వారం పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సార్వత్రిక ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి 26 వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె రాము బుధవారం (అక్టోబరు 10) ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, ఇంటర్ విద్యార్థులకు ధర్మకంచలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు.
ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే నాన్-యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు గడువు తేదీని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 34 సంవత్సరాలుగా ఉన్న వయోపరిమితిని తాజా ఉత్తర్వులతో 42 ఏళ్ల వరకు పెంచుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత కాలపరిమితి సెప్టెంబరు 30, 2023తో ముగిసింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీతోపాటు ఇతర నియామక సంస్థలు చేపట్టే ఉద్యోగ నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో సమ్మెటివ్-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 4వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాటిని ఈ నెల15వ తేదీకు వాయిదా వేశారు. 3, 6, 9వ తరగతులకు నవంబరు 3 నుంచి రాష్ట్ర స్థాయి సాధన సర్వే నిర్వహిస్తున్న కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.