
హైదరాబాద్, ఏప్రిల్ 5: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న తెలంగాణ ఈఏపీసెట్ 2026కు దరఖాస్తు గడువు ముగిసింది. ఆలస్య రుసుములేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4తో గడువు ముగిసింది. శనివారం సాయంత్రం నాటికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు జవహర్‌లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్) కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2,03,167 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు 86,523 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ రెండింటికి కలిపి 284 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ తెలిపారు. అమ్మాయిల నుంచి అధిక సంఖ్యలో అందాయి. గతేడాది ఈఏపీసెట్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. అయితే ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ముగిసే నాటికి మరో 10 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి కూడా దరఖాస్తుల సంఖ్య 3 లక్షలు దాటొచ్చని అంచనా.
ఇక రూ.250 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 5 నుంచి మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడనికి అవకాశం కల్పించారు. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్ధులు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ. 500 చెల్లించవల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ రెండింటికి కలిపి దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ.1800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 1000గా ఉంటుంది. ఈఏపీసెట్ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ వృత్తి విద్యా కాలేజీల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ విభాగాల్లోని సీట్లకు ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.