TGPSC Group 3 Exams: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలు ప్రారంభం.. తొలిరోజే పలువురు పరీక్షకు దూరం! ఏం జరిగిందంటే..

|

Nov 17, 2024 | 3:14 PM

తెలంగాణ గ్రూప్ 3 పరీక్షలు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే పటిష్ట నిఘాతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్భందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తొలిరోజే పలు చోట్ల అభ్యర్ధులు కొందరు పరీక్షకు దూరమయ్యారు..

TGPSC Group 3 Exams: టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్షలు ప్రారంభం.. తొలిరోజే పలువురు పరీక్షకు దూరం! ఏం జరిగిందంటే..
TGPSC Group 3 Exams
Follow us on

హైదరాబాద్‌, నవంబర్‌ 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 సర్వీసు పోస్టుల భర్తీకి రాతపరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 1,365 గ్రూప్‌ 3 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఆదివారం, సోమవారం (నవంబరు 17, 18 తేదీల్లో) ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1401 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం సెషన్‌లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరుగుతుంది. నవంబర్‌ 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 3 పరీక్ష నిర్వహించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. పకడ్భందీగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.

అయితే ఈ రోజు ఉదయం జరిగిన పేపర్‌ 1 పరీక్షకు కొన్ని ప్రాంతాల్లో అభ్యర్ధులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు 9.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేయడంతో అధికారులు ఆ అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ లేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన.. తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఆనంద్, వేములవాడ పట్టణానికి చెందిన మంజుల అనే ఇద్దరు అభ్యర్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరగవల్సి వచ్చింది. మరోవైపు సూర్యాపేట జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల వద్ద 15 మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. ఇక వికారాబాద్ జిల్లాలో 15 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 20 మంది పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. అధికారులను ఎంత బ్రతిమిలాడినా వారిని పరీక్షా కేంద్రాల్లోకి పంపించలేదు.

గ్రూప్‌ 3 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని ఇప్పటికే కమిషన్‌ స్పష్టం చేసింది. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒకటి ఒరిజినల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డును తమతోపాటు తీసుకెళ్లాలని కమిషన్‌ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.