TG TET 2024 Exam: టెట్‌కు తగ్గుతున్న దరఖాస్తులు.. పరీక్షపట్ల నిరుద్యోగుల్లో పెరుగుతున్న అనాశక్తి! కారణం అదేనా?

మరో రెండు రోజుల్లో తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2024 దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తు చూసి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోవడమే అందుకు కారణం..

TG TET 2024 Exam: టెట్‌కు తగ్గుతున్న దరఖాస్తులు.. పరీక్షపట్ల నిరుద్యోగుల్లో పెరుగుతున్న అనాశక్తి! కారణం అదేనా?
TG TET 2024 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 18, 2024 | 3:43 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 18: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) దరఖాస్తు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. నవంబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 20వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది రెండోసారి టెట్‌ నిర్వహించేందుకు విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే గతంతో పోల్చితే ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)పై ఏటా ఆసక్తి తగ్గుతుందని తెలుస్తుంది. అందుకు కారణం టెట్‌కు వస్తున్న దరఖాస్తులే. టెట్‌ 2024కు ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

గత ఐదు టెట్‌ వివరాలు గమనిస్తే..

  • 2016లో పేపర్‌ 1కు 88,661 దరఖాస్తులు, పేపర్‌ 2కు 2,51,906 దరఖాస్తులు వచ్చాయి.
  • 2017లో పేపర్‌ 1కు 98,848 దరఖాస్తులు, పేపర్‌ 2కు 2,56,265 దరఖాస్తులు వచ్చాయి.
  • 2022లో పేపర్‌ 1కు అత్యధికంగా 3,18,444 దరఖాస్తులు, పేపర్‌ 2కు 2,50,897 దరఖాస్తులు వచ్చాయి.
  • 2023లో పేపర్‌ 1కు 2,23,582 దరఖాస్తులు, పేపర్‌ 2కు 1,90,047దరఖాస్తులు వచ్చాయి.
  • 2024 (ప్రస్తుత టెట్‌)లో పేపర్‌ 1కు అత్యల్పంగా 39,741 దరఖాస్తులు, పేపర్‌ 2కు 75,712 దరఖాస్తులు వచ్చాయి.

2022లో రెండు పేపర్లకు 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, 2023లో 2.86 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఓసారి జరిపిన టెట్‌కు ఏకంగా 6.28 లక్షల మంది దరఖాస్తు చేశారు. అయితే ప్రస్తుత టెట్‌ దరఖాస్తుల గడువు నవంబర్‌ 20వ తేదీతో ముగియనుంది. శనివారం వరకు టెట్‌ పేపర్‌ 1కు 39,741, పేపర్‌ 2కు 75,712, రెండు పేపర్లకు కలిపి 10,599 చొప్పున మొత్తంగా 1,26,052 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది వరకైతే టెట్‌ నిర్వహించినప్పుడల్లా 4 నుంచి 6 లక్షల మంది వరకు దరఖాస్తు చేసేవారు. నిరుద్యోగులతోపాటు ఈ ఏడాది నుంచి కొత్తగా సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌కు హాజరవుతున్నారు. పదోన్నతులు కావాలంటే వారంతా టెట్‌ తప్పనిసరిగా పాసై ఉండాలి.

ఈ నేపథ్యంలో టెట్‌కు హాజరయ్యే వారి సంఖ్య మరింత పెరగాలి. కానీ ఇందుకు విరుద్ధంగా అంతంత మాత్రంగా దరఖాస్తులు వస్తున్నాయి. మరోవైపు టెట్‌ వ్యాలిడిటీ గతంలో ఏడేండ్లు ఉండేది. ప్రస్తుతం దీనిని జీవితకాలం పొడిగించారు. దీంతో గతంలో టెట్‌ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్‌ రాసేందుకు దూరంగా ఉంటున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 7032901383, 90007561 78 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.