టీచర్ ఎలిజిబిలిటీటెస్ట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం తగ్గేదే లే అంటోంది. ఈ నెల 12న టెట్ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున జాతీయ స్థాయిలో ఆర్ ఆర్ బీ ఎగ్జామ్ ఉండటంతో రెండు క్లాష్ అవుతున్నాయని.. టెట్ ను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ వర్సెస్ ఆర్ ఆర్ బీ ఎగ్జామ్ గా మారిన వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెట్ నిర్వహణపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ నెల 12న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ నిర్వహణకు అంతా రెడీ అయింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా పరీక్ష పెట్టి తీరాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగానే సాగుతోంది. అదే రోజును రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఎగ్జామ్ ఉందని.. పలువురు రెండు పరీక్షలు రాస్తున్నందున తెలంగాణ టెట్ ను వాయిదా వేయాలని కోరారు. అయితే 3 లక్షల 80 వేల మంది అభ్యర్థుల కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని.. ఎగ్జామ్ డేట్ ను అన్ని పరిశీలించాకే ఫిక్స్ చేసినందున యథాతథంగా కొనసాగుతుందని విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు.
టెట్ ఎగ్జామ్ ను అనుకున్న డేట్ కే కంప్లీట్ చేసి.. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా యథావిధిగా టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్లను విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. అందరూ వాటిని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష కోసం 2 వేల 683 సెంటర్లు ఏర్పాటు చేశారు. అబ్జర్వర్లుగా సీనియర్ అధికారులను నియమించారు. టెట్ పేపర్ వన్ కు 1480 సెంటర్లలో 3 లక్షల 51 వేల 468 మంది అభ్యర్థులు, పేపర్ 2 కు 1203 కేంద్రాల్లో 2 లక్షల 77 వేల మంది అటెండ్ కానున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే కలెక్టర్లు టెట్ నిర్వహణపై సమీక్ష జరిపి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోనికి అనుమతిచ్చేది లేదని చెప్పారు.
టెట్ నిర్వహణతో దాదాపు 5 నుంచి 10 వేల మంది అభ్యర్థులకు ఆర్ ఆర్ బీ ఎగ్జామ్ క్లాష్ అవుతోంది. ఇప్పటికే దీనిపై విద్యార్థి సంఘాలు ఆర్ ఆర్ బీ జాతీయ స్థాయి పరీక్ష కాబట్టి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ నే వాయిదా వేయాలంటూ కోరారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడించి పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు కూడా చేశాయి. దీనిపై ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ అభ్యర్థులు వాయిదా వేయాలని కోరగా.. దానిని పరిశీలించాలని మంత్రి కేటీఆర్.. సబితా ఇంద్రారెడ్డికి ట్యాగ్ చేశారు. టెట్ నిర్వహణ యథతధంగా కొనసాగుతుందని.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి సబిత స్పష్టం చేశారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటనలో టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి. సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13 వేల 86 పోస్టులు, 6వేల 500 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2000, ల్యాంగ్వేజ్ పండిట్ పోస్టులు 600 ఉన్నాయి. టెట్ నిర్వహణ తర్వాత ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.