Telangana Sainik School: తెలంగాణకు తొలి సైనిక్‌ స్కూల్‌.. రేపే సీఎం రేవంత్‌ చేతుల మీదగా భూమి పూజ!

Telangana to clear first Sainik School at Hakimpet in Vikarabad: రాష్ట్రానికి తొలి సైనిక్‌ స్కూల్‌ మంజూరు వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం అయిన వికారాబాద్‌ జిల్లాలో కొడంగల్‌ పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలోని ఎడ్యుకేషన్‌ హబ్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని..

Telangana Sainik School: తెలంగాణకు తొలి సైనిక్‌ స్కూల్‌.. రేపే సీఎం రేవంత్‌ చేతుల మీదగా భూమి పూజ!
Telanganas First Sainik School At Hakimpet

Updated on: Nov 23, 2025 | 9:10 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 23: తెలంగాణ రాష్ట్రానికి తొలి సైనిక్‌ స్కూల్‌ మంజూరు వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం అయిన వికారాబాద్‌ జిల్లాలో కొడంగల్‌ పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలోని ఎడ్యుకేషన్‌ హబ్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సైనిక్‌ స్కూల్‌ సొసైటీ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 21న నిపుణుల కమిటీ ఇక్కడ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అయితే విద్యాశాఖ వర్గాల సమాచారం మేరకు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

నవంబర్‌ 24న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. స్థలం, భవనాల నిర్మాణం, ఇతర నిర్వహణ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వం భరించవల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఇవన్నీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో మంజూరు చేస్తుందని విద్యాశాఖ వర్గాలు తెలిపారు. ఇప్పటికే దాదాపు 11 ఎకరాలకుపైగా స్థలం సైనిక్‌ స్కూల్ ఏర్పాటుకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఏడు ప్రభుత్వ విద్యాసంస్థలను సైనిక్‌ స్కూళ్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 2 నెలల క్రితం ప్రతిపాదనలు పంపింది. వీటిల్లో రంగారెడ్డి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి 3జిల్లా పరిషత్తు పాఠశాలలు ఉన్నాయి. ఇక వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, ములుగు జిల్లాల్లోని 4 జనరల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో కొత్తగా (గ్రీన్‌ఫీల్డ్‌) సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ జిల్లాలో రెసిడెన్షియల్‌ స్కూల్‌ను సైనిక్‌ స్కూల్‌గా మార్చే నిర్ణయం లేనట్లే. మిగిలిన ఆరు పాఠశాలల్లో ఎన్ని ఎంపికవుతాయన్నది ఇంకా తెలియరాలేదు.

కేంద్రం పరిధిలో పని చేస్తే సైనిక్‌ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచిత విద్య అందించడం జరుగుతుంది. కేంద్రం రెండేళ్ల క్రితం పాత విధానాన్ని రద్దు చేసింది. దీని స్థానంలో పీపీపీ విధానాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఏవైనా సైనిక్‌ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పీపీపీ విధానంలో 102 పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలకు ఫీజులో సగం కేంద్రం చెల్లిస్తుంది. గతంలో కేవలం రెసిడెన్షియల్‌ విధానం మాత్రమే ఉండేది. ప్రస్తుతం డే స్కాలర్‌ విధానంలోనూ సైనిక్‌ స్కూళ్లను నడిపేందుకు అనుమతి ఇచ్చింది. సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలంటే అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ( AISSEE ) రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఇందులో కనబరచిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.