HMWSSB Jobs 2026: ‘అలర్ట్.. హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు..’ జలమండలి సీరియస్ వార్నింగ్

హైదరాబాద్ వాటర్ బోర్డులో భారీ నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టర్ నకిలీదని తేలింది. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న తప్పుదోవ పట్టించే ఉద్యోగ ప్రకటనలను చూసి మోసపోవద్దని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఉద్యోగార్థులను బహిరంగంగా హెచ్చరించింది..

HMWSSB Jobs 2026: అలర్ట్.. హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. జలమండలి సీరియస్ వార్నింగ్
Fake Hyderabad Water Board Recruitment

Updated on: May 20, 2026 | 10:02 AM

హైదరాబాద్, మే 20: తెలంగాణ రాష్ట్ర జలమండలిలో ఉద్యోగాలు అంటూ నెట్టింట ప్రచారం జరగడంపై ఆ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలని జలమండలి స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టర్లపై అప్రమత్తంగా ఉండాలి తెలిపింది. జలమండలిలో ప్రస్తుతం ఎలాంటి నియామకాలు లేవని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలు ఉంటే TGPSC లేదా అధికారిక సంస్థల ద్వారానే ప్రకటనలు విడుదల చేస్తామని వెల్లడించింది.

ఇటీవల సోషల్ మీడియా వేదికగా “హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్మెంట్ 2026” పేరుతో ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. ఆ పోస్టర్‌లో జలమండలిలో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు, వేతనాలు, అర్హతల వివరాలు పేర్కొంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా జలమండలి క్లారిటీ ఇస్తూ ప్రకటన వెలువరించింది. ఇందులో జలమండలి స్పష్టం చేయునది ఏమనగా.. ప్రస్తుతం పోస్టర్‌లో పేర్కొన్న విధంగా ఎలాంటి నియామక ప్రక్రియను జలమండలి చేపట్టలేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం పూర్తిగా అసత్యం.. ఫేక్ న్యూస్.

జలమండలిలో ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి వచ్చిన సందర్భంలో, అవి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లేదా సంబంధిత అధికారిక సంస్థల ద్వారా మాత్రమే నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ప్రభుత్వ, జలమండలి అధికారిక వెబ్‌సైట్లు, విశ్వసనీయ మీడియా వేదికల ద్వారా విడుదల చేయబడతాయి. కావున ప్రజలు, ఉద్యోగార్థులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్ధారణ లేని పోస్టర్లు, వార్తలు, తప్పుడు ప్రకటనలను నమ్మవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోందని అందులో పేర్కొంది. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ, జలమండలి అధికారిక ప్రకటనలను మాత్రమే అనుసరించాలని సూచించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us