హైదరాబాద్, ఆగస్టు 24: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తెలంగాణ టీఆర్టీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా.. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నామని మంద్రి సబితా తెలిపారు. ఇందుకు సంబంధించి మరో రెండు రోజుల్లో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి సబితా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయని ఆమె వివరించారు.
కాగా.. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద పలు పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసిన సర్కార్ తాజాగా టీచర్ పోస్టులకు కూడా ప్రకటన వెలువరించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గురుకులాల్లో 12 వేల టీచర్ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. 19 రోజుల పాటు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన రాత పరీక్ష ఆగస్టు 23వ తేదీతో ముగిశాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.