First Class Admissions: ఆరేళ్లు దాటితేనే బడుల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి నిబంధనలను సడలించింది. ఇకపై ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందాలంటే చిన్నారుల వయసు తప్పనిసరిగా ఆరు సంవత్సరాలు నిండాలని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్యను ప్రారంభించాలని తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫారసు..

First Class Admissions: ఆరేళ్లు దాటితేనే బడుల్లో ఒకటో తరగతి అడ్మిషన్లు..!
Six Years Of Age Mandatory For 1st Class Admission

Updated on: Sep 21, 2025 | 7:18 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి నిబంధనలను సడలించింది. ఇకపై ఒకటో తరగతిలో ప్రవేశాలు పొందాలంటే చిన్నారుల వయసు తప్పనిసరిగా ఆరు సంవత్సరాలు నిండాలని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ విద్యను ప్రారంభించాలని తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫారసు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించింది. ప్రస్తుతం ఐదేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తు్న్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో మాత్రమే ఐదేళ్ల నిబంధన అమల్లో ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ మేరకు నిబంధల్లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ విద్యా కమిషన్‌ నివేదికలో వివరించింది. సీబీఎస్‌ఈ, ఐబీ తదితర బోర్డులు సైతం ఆరేళ్ల నిబంధనను అనుసరిస్తున్నట్లు గుర్తుచేసింది.

జూన్ 1 నాటికి ఆరేళ్లు దాటితేనే ఒకటో తరగతిలో ప్రవేశాలు

ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడం వల్లనే తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్లు రాగానే ప్లే స్కూళ్లలో చేరుస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను ప్రవేశపెడితే ఆ సమస్య ఉండదని సూచించింది. ప్రస్తుతం సర్కార్‌ బడుల్లో ఐదేళ్లు నిండిని వారికి ఒకటో తరగతి నుంచి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అందువల్ల ప్రైవేట్‌ బడుల్లో తల్లిదండ్రులు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివిస్తున్నారు. యూకేజీ పూర్తయ్యాక కూడా ప్రభుత్వ బడులకు బదులు ప్రైవేట్‌ స్కూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో కూడా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రారంభించాలని కమిషన్‌ సిఫారసు చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రస్తుతం 2025-26 విద్యా సంవత్సరంలో 1000 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లలో యూకేజీని ప్రవేశపెట్టింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, ఒడిశా, గోవా రాష్ట్రాలు ఐదేళ్లకు ప్రవేశం కల్పిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఆరేళ్ల నిబంధన అమల్లో ఉంది. ఇక యూకే, అమెరికా, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోలండ్, దక్షిణ కొరియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, ఇటలీ, హంగేరీ, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌.. దేశాల్లో ఆరేళ్ల నిబంధన అమల్లో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.