తెలంగాణలో డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం ఆ దిశగా మొదటి అడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి (సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తికాగా.. పేపర్ 1కి 99,958 మంది, పేపర్ 2కి 1,86,428 మంది అప్లై చేసుకున్నారు. ఇలా మొత్తం రెండు పరీక్షలకు కలిపి 2,86,386 మంది అప్లై చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మే 20వ తేదీ నుంచి మొదలుకానున్న పరీక్షలు, జూన్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు టెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఈ రోజు పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు సెషన్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2 గంటలను నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుంది. పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. అత్యధికంగా మేడ్చల్‌లో 25, రంగారెడ్డిలో 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 నిమిషాలు ముందే గేట్లు మూసి వేస్తామని అధికారులు తెలిపారు.
ఇక టెట్ పరీక్షా ప్రశ్నాపత్రం వివరాల విషయానికొస్తే 150 మార్కులకు పేపర్-1, 150 మార్కులకు పేపర్-2 ఉంటుంది. పేపర్ 1లో 5 విభాగాలు, పేపర్ 2లో 4 విభాగాలు ఉంటాయి. పరీక్షలో 60 శాతం మార్కులు సాధించిన వారు డీఎస్సీకి అర్హులుగా నిర్ణయించారు. అయితే బీసీలకు 50 శాతం, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 40 శాతంగా నిర్ణయించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..