
హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025 జూన్)కు ఆన్‌లైన్ దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అయితే నోటిఫికేషన్ సమయంలో టెట్ పరీక్ష తేదీలను విద్యాశాఖ వెల్లడించలేదు. తాజాగా తెలంగాణ టెట్ పరీక్ష తేదీలను విద్యాశాఖ ఖరారు చేసింది. విద్యాశాఖ ప్రకటన మేరకు.. టెట్ పరీక్షలను జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు మొత్తం 9 రోజుల పాటు రోజుకు రెండు సెషన్స్ ప్రకారం మొత్తం 16 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది.
కాగా టెట్ జూన్ సెషన్‌కు సంబంధించి వచ్చిన మొత్తం 1,83,653 దరఖాస్తుల్లో.. పేపర్ 1కు 63,261 మంది, పేపర్ 2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రెండు పేపర్లకు దరఖాస్తు చేసిన వారు 15 వేల మంది వరకు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన టెట్‌కు 2,75,775 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈసారి ఏకంగా 92,122 దరఖాస్తులు తగ్గాయి. ఇప్పటికే ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న వారిలో చాలామంది స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.