
తెలంగాణ స్కూల్ ఎడ్యూకేషన్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సర్కారు కృషి చేస్తోంది. ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం.. బోధనలోనూ రాజీ పడేది లేదంటోంది. విద్యా బోధనలో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు మరో అడుగు వేసింది. సర్కారు బడి టీచర్లను, విద్యాశాఖ అధికారులను విదేశాలకు పంపించాలని నిర్ణయించింది. ‘గ్లోబల్ లెర్నింగ్ టూర్’ పేరిట సుమారు 160 మందిని సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ వంటి దేశాలకు ప్రభుత్వం పంపనుంది.
టీచింగ్‌లో ఐదేళ్లకు తగ్గకుండా ఎక్స్ పీరియన్స్ ఉండి పాస్ పోర్టు ఉన్న టీచర్స్‌ను ఫారెన్ పంపనున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్, డీఈవో, జిల్లా స్థాయి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ జిల్లాకు ముగ్గురు చొప్పున ఉత్తమ టీచర్ల పేర్లను ఎంపిక చేయనుంది. ఇందుకుగానూ మూడేళ్లలో వారి పనితీరు పరిశీలిస్తారు. పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంచడంలో వారు తీసుకున్న చొరవ, బడి బాట పట్టేలా చేసిన కృషి, అవార్డులు, వినూత్న బోధన పద్దతుల అవలంబించడం వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు. జపాన్ విద్యా వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అంతేకాదు మిగతా దేశాల్లోని స్కూళ్లలో వినూత్న బోధనా పద్ధతులు, అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన, టీచర్ల పనితీరు, టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాలను మన రాష్ట్ర ఉపాధ్యాయులు తెలుసుకోనున్నారు.
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ టీచర్స్‌ను విదేశాలకు స్టడీ టూర్‌కు వెళ్లడం సర్కారు బడుల టీచింగ్ క్వాలిటీ పెంచడానికి ఉపయోగపడుతుందని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని.. వారి విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..