
హైదరాబాద్, మే 1: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకు బుధవారం (ఏప్రిల్ 30) ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఈసారి రికార్డు స్థాయిలో ఏకంగా 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా తర్వాత ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతం కావడం గమనార్హం. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 4,60,519 మంది విద్యార్ధులు పాసయ్యారు. గత ఏడాది కన్నా ఈసారి 1.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది.
అబ్బాయిల ఉత్తీర్ణత 2,28,608 (91.32 శాతం) కాగా.. అమ్మాయిలు 2,31,911 (94.26 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మహబూబాబాద్ జిల్లా 99.29 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో సంగారెడ్డి 99.09 శాతం, మూడో స్థానంలో జనగామ 98.81 శాతంతో టాప్ 3లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది. తాజా ఫలితాల్లో నిమ్మ అంచిత, సిర్ప దృతి అనే ఇద్దరు బాలికలు 600 మార్కులకు గాను అత్యధికంగా 596 మార్కులతో సత్తా చాటారు.
రాష్ట్రంలో మొత్తం 11,554 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 4,629 బడుల్లో 100 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. రెండు ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాలేదు. ఇక రాష్ట్ర గురుకుల పాఠశాలలు 98.79 శాతంతో ఉత్తీర్ణతలో అగ్రస్థానంలో నిలిచాయి. ఫెయిలైన విద్యార్ధులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 16 తేదీలోపు తమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించి పరీక్షలు రాయవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో సబ్జెక్టు పరీక్ష జరిగే ముందు రెండు రోజుల వరకు చెల్లించవచ్చు. రీకౌంటిక్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున మే నెల 15వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఒక్కో సబ్జెక్టుకు మే 15వ తేదీలోపు రూ.1000 చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.