TG Inter Result Date 2026: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల ఈ తేదీల్లోనే!
రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నిరీక్షణకు తెరదించుతూ ఇంటర్ బోర్డు కసరత్తును ముమ్మరం చేసింది. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళిక..

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. విద్యార్థులు మరియు తల్లిదండ్రుల నిరీక్షణకు తెరదించుతూ ఇంటర్ బోర్డు కసరత్తును ముమ్మరం చేసింది. ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
ఏప్రిల్ 10 లోపు ఫలితాలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం శరవేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 3వ తేదీ నాటికి వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాతి మూడు రోజుల్లో సాంకేతిక ప్రక్రియ, కోడింగ్, డీకోడింగ్ పనులను పూర్తి చేసి.. ఏప్రిల్ 6, 8 లేదా 9 తేదీల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి ఈ తేదీల్లో ఒక రోజును ఖరారు చేయనున్నారు. మొత్తానికి ఏప్రిల్ 10 లోపు విద్యార్థుల చేతికి మార్కుల జాబితా అందనుంది.
ఈసారి డబుల్ వాల్యుయేషన్.. తప్పులకు నో ఛాన్స్!
గతంలో ఫలితాల వెల్లడిలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి పేపర్‌ను రెండుసార్లు వాల్యుయేషన్ చేసేలా ఏర్పాట్లు చేసింది. తుది ఫలితాలను ప్రకటించే ముందు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన జరిగాకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. వాల్యుయేషన్ కేంద్రాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ ప్రక్రియ సాగుతోంది. వాల్యుయేషన్ కేంద్రాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మరియు ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనధికార వ్యక్తులకు ప్రవేశం నిషిద్ధం విధించారు
వాల్యుయేషన్ విధుల్లో ఉన్న అధ్యాపకులకు ఇంటర్ బోర్డు ఈసారి రెమినరేషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో అధ్యాపకుడు రోజుకు 25 నుంచి 30 పేపర్లు దిద్దేలా క్రమబద్ధీకరించారు. దీనివల్ల పని భారం తగ్గడమే కాకుండా పేపర్లను నిశితంగా పరిశీలించే అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్న ఇంటర్ బోర్డు, ఈసారి ఎటువంటి వివాదాలకు తావులేకుండా రికార్డు సమయంలో ఫలితాలను ఇచ్చేందుకు సిద్ధమైంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




