
హైదరాబాద్, మే 11: తెలంగాణలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ మే 12, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల విద్యార్థులు మే 31 వరకు ఆయా కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రవేశం పొందిన విద్యార్థులకు జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఇంటర్ అడ్మిషన్ల కోసం కళాశాలలు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతిలో సాధించిన జీపీఏ (GPA) మరియు సబ్జెక్టుల వారీ గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే సీట్లు కేటాయించాలని సూచించింది. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు కల్పించవచ్చని, ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాత వాటిని ఖరారు చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి పరీక్షలు నిర్వహించే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
అడ్మిషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29% చొప్పున కేటాయించగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 10% సీట్లు కేటాయించారు. ప్రత్యేకంగా బాలికల కళాశాలలు లేని చోట, అన్ని కేటగిరీల్లో 33.33% సీట్లను బాలికలకే కేటాయించాలి. అలాగే, అడ్మిషన్ సమయంలో విద్యార్థుల ఆధార్ నంబర్ సమర్పించడం తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది. గ్యాప్ పీరియడ్ ఉన్న విద్యార్థులు స్థానిక తహశీల్దార్ నుంచి నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని కొత్త నిబంధనలను చేర్చారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా ‘యాంటీ-డ్రగ్ అఫిడవిట్’ సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులు ప్రవేశం పొందితే 24 గంటల్లోపు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రిన్సిపాళ్లకు సూచించింది. విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకు, కేవలం ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన అఫిలియేటెడ్ కళాశాలల్లోనే చేరాలని సూచించింది. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను www.tgbie.cgg.gov.in లేదా www.acadtgbie.telangana.gov.in వెబ్‌సైట్లలో తనిఖీ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.