
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను వీలైనంత త్వరగా అంటే ఏప్రిల్ 10 లోపు, వీలైతే ఏప్రిల్ 6వ తేదీనే విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలవగా, ఈసారి దాదాపు రెండు వారాల ముందే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలను పునఃప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. ఈ లోపే ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, వారి ఫలితాలను కూడా మే 31 నాటికి వెల్లడించాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా పై చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో ఆన్సర్ షీట్స్ దిద్దుబాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఫలితాలను త్వరగా ఇచ్చేందుకు వీలుగా ఈసారి మూల్యాంకన సమయాన్ని పెంచారు. గతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వాల్యూయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచారు.
అయితే సమయం పెంచడంతో పాటు మూల్యాంకనానికి ఇచ్చే పేపర్ల సంఖ్యను కూడా పెంచడంపై అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు 30 పేపర్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్యను 45 వరకు పెంచడం వల్ల ఏకాగ్రత లోపించి విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని వరంగల్ వంటి కేంద్రాల్లోని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై స్పందించిన బోర్డు కార్యదర్శి.. పేపర్ల సంఖ్యను 40 లోపే ఉంచాలని ఆదేశించామన్నారు. పండుగ సెలవుల విషయంలో కూడా స్పష్టతనిస్తూ ఉగాది లేదా రంజాన్ జరుపుకోవాలనుకునే వారు సెలవు తీసుకోవచ్చని, క్యాంపులు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.