
హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో బుధవారం (జనవరి 28) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష బాధ్యతలను ఈసారి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఉన్నత విద్యా మండలి అప్పగించింది. టీఎస్ ఐసెట్ కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సీనియర్ ప్రొఫెసర్, వర్సిటీ రిజిస్టర్ అయిన ప్రొఫెసర్ అల్వాల రవిని నియమించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఇక ఫిబ్రవరి 12 నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 16 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలు మే 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అభ్యర్ధులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ సూచించారు.
తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EdCET) 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదలకానుంది. ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 18 మధ్య కొనసాగుతుంది. రెండేళ్ల BED ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష మే 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.