
హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం మొత్త 2,769 ప్రీ-ప్రైమరీ సెక్షన్లను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూళ్లలో టీచర్, ఆయా ఉద్యోగాల కోసం 5, 538 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 2,769 టీచర్ పోస్టులు, 2,769 ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలలో నర్సరీ, LKG, UKG తరగతుల ఉపాధ్యాయులతో పాటు ఆయా పోస్టులు కూడా ఉన్నాయి.
ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఈ మేరకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇందులో టీచర్లకు (ఇన్‌స్ట్రక్టర్లు) నెలకు రూ.8,000, ఆయాలకు నెలకు రూ.6,000 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యా ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ నియామకాలను చేపడుతున్నారు. అర్హులైన అభ్యర్థులు జిల్లా వారీగా వెలువడే ప్రకటనలను గమనించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోంది. అంకితభావం గల ఉపాధ్యాయులను, సహాయక సిబ్బందిని నియమించడం ద్వారా చిన్నారులకు మెరుగైన అభ్యసన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి ఇతర వివరాలు ఆయా జిల్లాల నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.