Telugu Subject: ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి.. సర్కార్‌ ఉత్తర్వులు జారీ

Telugu as Compulsory Subject in Schools: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని డిసైడ్ చేసింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా అమలు చేసేందుకు విద్యాశాఖకు అనుమతి ఇచ్చింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కోంది..

Telugu Subject: ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి.. సర్కార్‌ ఉత్తర్వులు జారీ
Telugu as Compulsory Subject in TG schools

Updated on: Feb 26, 2025 | 7:09 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరిగా బోధించాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్, CBSE, ICSE, IB, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు తెలుగు తప్పనిసరిగా సబ్జెక్టుగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 25) ఉత్తర్వులు జారీ చేసింది. 9వ తరగతి విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతి విద్యార్ధులకు 2026-27 నుంచి ఈ అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచించింది.

కాగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో తెలంగాణ (Compulsory Teaching and Learning of Telugu in Schools) చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే, గత ప్రభుత్వం వివిధ కారణాల వల్ల పాఠశాలల్లో తెలుగు బోధనను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. రాష్ట్రంలో గతేడాది అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు అమలుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకువచ్చింది. తదనుగుణంగా యాజమాన్యంతో సమావేశం నిర్వహించి, రాబోయే విద్యా సంవత్సరం నుంచి CBSE, ICSE వంటి ఇతర బోర్డు స్కూళ్లలో కూడా 9, 10 తరగతులకు తెలుగు సబ్జెక్టును బోధించాలనే నిర్ణయాన్ని తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది.

అయితే బోర్డు విద్యార్థులకు తెలగు సబ్జెక్టును సులభంగా బోధించడానికి ‘వెన్నెల’ అనే ‘సరళ తెలుగు’ పాఠ్యపుస్తకాన్ని ఉపయోగించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం తెలిపారు. ‘సరళ తెలుగు’ పాఠ్యపుస్తకాన్ని అమలు చేయడం వల్ల తెలుగు మాతృభాషగాలేని విద్యార్థులకు, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.