Telangana: ఉద్యోగాల భ‌ర్తీకి రంగం సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ విభాగాలు.. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లు ఇవే!

|

Mar 25, 2022 | 2:57 PM

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఊపందుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక, పోలీసు, వైద్య, విద్యా శాఖలోని ఖాళీల వివరాలు వెల్లడించిన ప్రభుత్వం, నియామక ప్రక్రియకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం..

Telangana: ఉద్యోగాల భ‌ర్తీకి రంగం సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ విభాగాలు.. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లు ఇవే!
Ts Govt Jobs
Follow us on

Telangana mega recruitment process for 80,039 jobs: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఊపందుకుంటోంది. ఇప్పటికే ఆర్థిక, పోలీసు, వైద్య, విద్యా శాఖలోని ఖాళీల వివరాలు వెల్లడించిన ప్రభుత్వం, నియామక ప్రక్రియకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సర్కారు ప్రకటించిన 80,039 ఉద్యోగాల్లో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా రోస్టర్‌ ప్రాతిపదికన రిజర్వేషన్లు, పోస్టుల వారీగా విద్యార్హతలు, వయసు, ఉద్యోగ పరీక్షల విధానం, ప్రభుత్వ నిబంధనలు, సిలబస్‌ తదితర అంశాలపై ప్రభుత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ (TSPSC), పోలీసు, వైద్య నియామక బోర్డుల అధికారులతో ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రతిపాదనలు ఏ విధంగా ఉండాలి? న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు.. తదితర విషయాలపై నియామక సంస్థలు అధికారులకు పలు సూచనలు చేశాయి.

ఆర్థికశాఖ అనుమతి ఉత్తర్వులకు ముందుగా రోస్టర్‌ తదితర విషయాలపై సాధారణ పరిపాలన విభాగం స్పష్టత ఇచ్చింది. ఉద్యోగ ప్రకటన జారీకి ముందుగా ఆర్థికశాఖ అనుమతులు కీలకం. ఆ తరువాత సంబంధిత విభాగాలు రిజర్వేషన్లు, విద్యార్హతలు, సిలబస్‌, పరీక్ష విధానంపై ప్రతిపాదనలు రూపొందించి నియామక సంస్థలకు అందిస్తాయి. ఇవి సరిగా ఉన్నాయని నియామక సంస్థలు నిర్ధారించుకున్న తర్వాత నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతాయి. ఇప్పటికే అనుమతి పొందిన పోస్టుల్లో పోలీసు నియామక సంస్థ పరిధిలో మొత్తం16,804 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు అర్హతలు, రోస్టర్‌ ప్రకారం రిజర్వేషన్‌ తదితర అంశాలపై హోంశాఖ సమాయత్తమవుతోంది. ప్రతిపాదనలు పంపించాల్సిన విధానంపై బోర్డు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. వైద్య ఆరోగ్య విభాగంలో 10,028 పోస్టుల నోటిఫికేషన్ల జారీకి ప్రాథమిక ప్రక్రియ మొదలైంది. టీఎస్‌పీఎస్సీ పరిధిలో గ్రూప్‌-1కింద 503 పోస్టులతో కలిపి మొత్తం 3,576 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. గ్రూప్‌-1 కింద ప్రభుత్వ విభాగాలు అందించాల్సిన ప్రతిపాదనలపై అధికారులకు అవగాహన కల్పించింది. రిజర్వేషన్లు, పోస్టుల వారీగా అర్హతలు తదితర అంశాలను చర్చించింది. ప్రభుత్వ విభాగాలు వారం నుంచి పది రోజుల్లోగా రోస్టర్‌ ప్రకారం రిజర్వేషన్లు, విద్యార్హతలు, పరీక్ష విధానం, సిలబస్‌ తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని సద్వానియోగం చేసుకొవాలనే తపనతో పోటాపోటీగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వివిధ కోచింగ్‌ సెంటర్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయి.

Also Read:

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..