AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS TET 2022: మళ్లీ ప్రారంభమైన టెట్‌ సందడి.. ఈ ఏడాది తెలంగాణ టెట్‌ పరీక్షకు 1.20 లక్షలకు పైగా నమోదుకు అవకాశం!

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) నోటిఫికేషన్‌ గురువారం (మార్చి 24) విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలను కూడా ప్రకటించింది. దీంతో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు..

TS TET 2022: మళ్లీ ప్రారంభమైన టెట్‌ సందడి.. ఈ ఏడాది తెలంగాణ టెట్‌ పరీక్షకు 1.20 లక్షలకు పైగా నమోదుకు అవకాశం!
Tet Preparation
Srilakshmi C
|

Updated on: Mar 25, 2022 | 3:30 PM

Share

TS TET notification 2022: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) నోటిఫికేషన్‌ గురువారం (మార్చి 24) విడుదలైంది. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీలను కూడా ప్రకటించింది. దీంతో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు హైదరబాద్‌ నగరంలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో కోచింగ్‌ల బాట పడుతున్నారు. పరీక్షకు తక్కువ సమయం ఉండటంతో కోచింగ్‌ తీసుకునేందుకు నగరానికి చేరుకుంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, మూసారాంబాగ్, కూకట్‌పల్లిలో దాదాపు 50 శిక్షణ కేంద్రాలున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు వసతి గృహాల్లో ఉంటూ పరీక్ష రాస్తుంటారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 47 బీఈడీ కళాశాలల్లో 4700 సీట్లు ఉన్నాయి. మూడేళ్లలో 14 వేల మంది కోర్సు పూర్తి చేశారు. ప్రస్తుతం చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులకు సెప్టెంబరులో కోర్సు పూర్తి కానుంది. వీరు కూడా తమకు టెట్‌ రాసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈసారి టెట్‌కు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో దాదాపు 1.20 లక్షల మంది రాసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గతంలో 2016 మే, 2017 జులై టెట్‌ నిర్వహించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నోటిఫికేషన్‌ రావడంతో తెలంగాణతోపాటు ఓపెన్‌ కేటగిరీలో ఏపీ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పెద్దసంఖ్యలో నగరానికి వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. ఈసారి కోచింగ్‌ కేంద్రాలు కూడా ఫీజులు భారీగా పెంచేశాయి. సాధారణంగా షార్ట్‌టర్మ్‌ కోచింగ్‌ కింద వంద రోజుల ప్రణాళిక ఉండేది. ఇప్పుడు రెండున్నర నెలల సమయమే ఉండటంతో దానికి తగ్గట్టుగా కోచింగ్‌ సెంటర్‌లు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే ఆ సర్టిఫికేట్‌ జీవితకాలం వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది కూడా. దీంతో బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్ధులు ఉపాధ్యాయ కొలువు సాధించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Telangana State Teacher Eligibility Test 2022 నోటిఫికేషన్‌ ముఖ్య సమాచారం..

అర్హతలు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఈడీ)/ డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్‌ పండిట్‌/ తత్సమాన అర్హతలు ఉన్న అభ్యర్థులతో పాటు చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: టీఎస్‌ టెట్‌ 2022 పరీక్షలో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్‌ 2) ఉంటాయి. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భోధించాలనుకునేవారు పేపర్‌ 1 పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు భోధించాలనుకునేవారు పేపర్‌ 2 పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగరతి వరకు భోధించాలనుకునేవారు పేపర్‌ 1, పేపర్‌ 2 (రెండింటికి) హాజరుకావాల్సి ఉంటుంది.

  • పేపర్‌ 1: దీన్ని మొత్తం 150 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండున్నర గంటలు ఉంటుంది.
  • పేపర్‌ 2: దీన్ని మొత్తం 150 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండున్నర గంటలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.300 చెల్లించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 26, 2022.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 12, 2022.

హాల్‌టికెట్లు విడుదల తేది: జూన్‌ 6, 2022.

టెట్‌ 2022 పరీక్ష తేది: జూన్‌ 12, 2022.

  • పేపర్‌ 1: ఉదయం 9.30 నిముషాల నుంచి మధ్యాహ్నాం 12.00 గంటల వరకు ఉంటుంది.
  • పేపర్‌ 2: మధ్యాహ్నాం 2.30 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది.

టెట్‌ 2022 పరీక్ష ఫలితాల వెల్లడి: జూన్‌ 27, 2022.

ఇతర సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Telangana: ఉద్యోగాల భ‌ర్తీకి రంగం సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ విభాగాలు.. త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లు ఇవే!