TG Inter Mid Day Meal: ఇక తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధులకూ మధ్యాహ్న భోజనం.. రేవంత్ సర్కార్ నిర్ణయం!

|

Jan 21, 2025 | 8:01 AM

ఈ నెల ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ పథకాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంటర్ విద్యాశాఖకు హుకూం జారీ చేసింది..

TG Inter Mid Day Meal: ఇక తెలంగాణ ఇంటర్‌ విద్యార్ధులకూ మధ్యాహ్న భోజనం.. రేవంత్ సర్కార్ నిర్ణయం!
TG Inter Mid Day Meal
Follow us on

హైదరాబాద్‌, జనవరి 21: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో కూటమి సర్కార్ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలతోపాటు జూనియర్‌ కాలేజీల్లో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో కూడా అమలు చేయాలని రేవంత్‌ సర్కార్‌ యోచిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్‌ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అనంతరం ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనుంది. దీనికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేయాలని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 425 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.70 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. చాలా వరకు జూనియర్‌ కాలేజీలన్నీ నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు రోజూ దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. పొద్దున్నే భోజనం తెచ్చుకునే వీల్లేనివారు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లిపోయి.. ఇక తిరిగి కళాశాలకు రావడం లేదు. దీంతో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయి. హాజరు కూడా భారీగా పడిపోతుంది. ఈ సమస్యల నివారణకు రేవంత్‌ సర్కార్‌ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇక వారంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనున్నట్లు ఇంటర్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. ఈ పథకం అమలుకు ఏటా రూ.100 నుంచి 120 కోట్లు అవసరమవుతాయని అంచనా.

కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలతోపాటు బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో చదువుతున్న 3.91 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని 2018లోనూ అప్పటి సర్కార్‌ భావించింది. అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పథకం అమలుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించాలని భావించినా అమలుకు నోచుకోలేదు. మళ్లీ 2020 జులై 17న కూడా మరోమారు ప్రయత్నం జరిగింది. కానీ ఇదీ ఫలించలేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా ఈ పథకాన్ని అమలు చేయాలని మూడోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదైనా పట్టాలెక్కుతుందేమో వేచి చూడాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.