పదో తరగతి అనేది సగటు విద్యార్థి జీవితంలో కీలక మెట్టు. అలాంటి పదో తరగతి ఎగ్జామ్స్‌ను ఎదుర్కొనే 2023-24 అకాడమిక్ ఈయర్ విద్యార్థులకు కీలక సమయం అసన్నమయ్యింది. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు తేదీ షెడ్యూల్‌ను తాజాగా తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. దీంతో పదో తరగతి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అలర్ట్ కావాల్సి ఉంది. కాగా నవంబర్ 17వ తేదీ లోపు పదో తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ఆ సమయంలోపు పరీక్షల ఫీజు చెల్లించిన వారు రూ.50 లేట్ ఫీజుతో డిసెంబర్ 1 వరకు, రూ.200 లేట్ ఫీజుతో డిసెంబర్ 11, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అనుమతినిచ్చినట్టు పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇకపోతే పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు అన్ని ఎగ్జామ్ పేపర్లకు కలిపి రూ.125 చెల్లించాల్సి ఉంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు మూడు సబ్జెక్టుల లోపు ఫెయిలైన వారు రూ.110 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల కంటే ఎక్కువ ఫెయిల్ అయిన విద్యార్థులు రూ.125 చెల్లించాలని చెప్పింది. ఇక ఒకేషనల్ విద్యార్థుల విషయానికొస్తే.. రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది మార్చిలో ఉండనున్నాయి.
ఇదిలావుంటే.. పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు తేదీ వచ్చిందంటే.. విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు పక్కా ప్రణాళితో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం అలర్ట్‌గా ఉంటేనే పది పరీక్షల్లో మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ మంచి ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునే పరిస్థితి కల్పించాలి. అప్పుడే మంచి ఫలితాలను సాధించవచ్చు.