TGCHE: డిగ్రీ సైన్స్‌ కోర్సుల్లో క్రెడిట్లకు భారీగా కోత.. ప్రాక్టికల్స్‌ రద్దు! వచ్చే ఏడాది నుంచి అమలు

|

Dec 30, 2024 | 8:06 AM

తెలంగాణ ఉన్నత విద్యామండలి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. డిగ్రీ సైన్స్ కోర్సుల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సైన్స్ కోర్సుల్లో క్రెడిట్ పాయింట్లను భారీగా తగ్గించనుంది. అలాగే ప్రాక్టికల్స్ కూడా రద్దు చేయనుంది. వీటి స్థానంలో ప్రాజెక్ట్ వర్క్ లను తీసుకురానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

TGCHE: డిగ్రీ సైన్స్‌ కోర్సుల్లో క్రెడిట్లకు భారీగా కోత.. ప్రాక్టికల్స్‌ రద్దు! వచ్చే ఏడాది నుంచి అమలు
Degree Science Courses
Follow us on

హైదరాబాద్, డిసెంబర్‌ 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో సైన్స్‌ కోర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మండలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్‌ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా వీటిని 146కు కుదించనున్నారు. ఈ మేరకు క్రెడిట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సబ్జెక్టు నిపుణులు, పలు వర్సిటీల సైన్స్‌ విభాగాల బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌(బీవోఎస్‌) చైర్మన్లతో త్వరలోనే సంప్రదింపులు జరపనుంది. ఇది అమలులోకి వస్తే లైఫ్‌ సైన్సెస్‌ సహా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ వంటి సైన్స్‌ కోర్సుల్లో క్రెడిట్ల సంఖ్య తగ్గనుంది.

దీంతోపాటు ప్రాక్టికల్‌ పరీక్షలను కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్‌ స్థానంలో ప్రాజెక్ట్‌ వర్క్‌ను తీసుకురానున్నారు. ప్రస్తుతం డిగ్రీ థర్డ్‌ ఇయర్‌లో నాలుగు థియరీ, నాలుగు ప్రాక్టికల్స్‌ పేపర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక ప్రాక్టికల్‌కు బదులుగా ప్రాజెక్ట్‌ వర్క్‌ను చేర్చాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను వర్కింగ్‌డే లేదా సెలవుల్లో పూర్తిచేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలోని యూననివర్సిటీల్లో క్రెడిట్స్‌ విధానం ఒకే తరహాలో లేదు. వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి అన్ని వర్సిటీల్లో కామన్‌ క్రెడిట్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

GATE 2025 Exam Date: గేట్ పరీక్ష తేదీ ఇదే.. త్వరలో అడ్మిట్‌కార్డులు విడుదల

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2025 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ కీలక అప్‌డేట్ జారీ చేసింది. త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు విడుదలకానున్నాయి. తాజాగా గేట్ టెస్ట్‌ పేపర్ల వారీగా గేట్‌ పరీక్ష షెడ్యూల్‌ను ఐఐటీ రూర్కీ వెల్లడించింది. గేట్ ఆన్‌లైన్‌ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

కాగా గేట్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అక్టోబర్‌ 11వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగిశాయి. గేట్‌ పరీక్ష అనంతరం మార్చి 19వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి 2 నుంచి అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు. మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష జరుగుతుంది. గేట్‌ స్కోర్‌ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థల్లో ఎమ్‌టెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే గేట్‌ స్కోర్‌ ఆధారంగా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తాయి.

గేట్ 2025 పరీక్షల షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.