
హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది (2026) మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఈ సారి పదో తరగతి పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు మధ్య ఒకటి రెండు రోజుల వ్యవధి ఇవ్వాలనే ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ అధికారులు రెండు మూడు రకాల షెడ్యూళ్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరీక్షల తేదీల షెడ్యూల్ ప్రకటనలో జాప్యం నెలకొంది.
అయితే సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లోనూ ఈ విధంగా కొన్ని పరీక్షలకు కాస్త ఎక్కువగానే వ్యవధి వస్తుంది. ఒక్కోసారి వారం రోజుల వ్యవధి కూడా ఉంటోంది. అదే విధానాన్ని రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లోనూ అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాగా గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కొన్ని పరీక్షల మధ్య కనీసం ఒక్క రోజు కూడా వ్యవధి రాలేదు. పరీక్షల మధ్య వ్యవధి ఉండాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.
పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు మధ్య వ్యవధి ఇస్తూ ఎక్కువ రోజులు పరీక్షలు జరిపితే విద్యార్ధుల్లో ఒత్తిడి పెరుగుతుందని, త్వరగా ముగిస్తేనే బెటర్ అని కొందరు అంటున్నారు. అయితే పరీక్షల మధ్యలో ఒకటిరెండు రోజుల వ్యవధి ఉండటం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా చదువుకుంటారని మరికొందరు నిపుణులు సూచిస్తున్నారు. సీబీఎస్సీ తరహాలో మరీ ఎక్కువగా కాకుండా ఒకటి రెండు రోజుల వ్యవధి ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. నిజానికి సీబీఎస్‌ఈ బోర్డు పదో తరగతి, 12 తరగతులకు ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తుంది. మరోవైపు ఆప్షనల్ సబ్జెక్టులు కూడా ఉండటం వల్ల ఒక్కో పరీక్ష మధ్య కనీసం రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు వ్యవధి వస్తుంది. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ను సెప్టెంబరు 24న విడుదలైన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.