హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్రంలో జూన్ 3 నుంచి 13 వరకు జరగనున్న పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించారు. అలాగే వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాది మొత్తం 51,237 మంది అభ్యర్ధులు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో బాలురు 31,625 మంది, బాలికలు 19,612 మంది ఉన్నారని ఆయన తెలిపారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 170 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
జూన్ 3న తెలుగు, ఫస్ట్ ల్యాంగ్వేజ్‌లో కాంపోజిట్ కోర్సు-1, కాంపోజిట్ కోర్సు-2 పరీక్షలు, జూన్ 5న సెకండ్ ల్యాంగ్వేజ్ పరీక్ష, జూన్ 6న ఇంగ్లిష్ పరీక్ష, జూన్ 7న గణితం పరీక్ష, జూన్ 8న భౌతికశాస్త్రం పరీక్ష, జూన్ 10న జీవశాస్త్రం పరీక్ష, జూన్ 11న సాంఘికశాస్త్రం పరీక్ష, జూన్ 12న ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-1 పరీక్ష, జూన్ 13న ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష (సంస్కృతం, అరబిక్) పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మోడల్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.