Police Constable Jobs: పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి.. హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం

రెండుళ్లుగా కోర్టు కేసుల్లో నానుతున్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు మొండి వైఖరిని అత్యున్నత ధర్మాసనం తప్పుబట్టింది. అది దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది..

Police Constable Jobs: పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి.. హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం
Police Constable Jobs

Updated on: Apr 10, 2025 | 4:07 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15,644 పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకం కోసం 2022 ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ స్టేట్‌లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పులు వెలువరించింది. ఈ మేరకు బుధవారం విచారణ జరపగా జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం వివాదాస్పద ప్రశ్నలను నిపుణుల కమిటీకి ప్రతిపాదించి రెండు నెలల్లోపు మొత్తం నియామక ప్రక్రియను పూర్తిచేయాలని బోర్డును ఆదేశించింది. అలాగే ఇప్పటికే పూర్తయిన నియామకాలపై ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అసలేం జరిగిందంటే..?

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు మొత్తం 15,644 కానిస్టేబుల్‌ పోస్టుల నియామకానికి సంబంధించి రెండేళ్ల క్రితం అంటే 2023 ఏప్రిల్‌ 30న రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో 12 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సంస్థ ప్రిలిమినరీ కీని నిపుణుల కమిటీకి ప్రతిపాదించి దాని సిఫార్సుల ఆధారంగా 2023 మే 30న తుది ఆన్సర్‌ కీ విడుదల చేసింది. అయితే కొందరు అభ్యర్థులు దాన్ని సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారించిన ఏకసభ్య ధర్మాసనం ఆ పిటిషన్లపై విచారించి నాలుగు ప్రశ్నలను తొలగించాలని ఆదేశించింది. దీంతో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆ తీర్పును సవాల్‌చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. అది ఏకసభ్య ధర్మాసనం తీర్పును పక్కనపెట్టి.. మొత్తం 12 ప్రశ్నలను ఉస్మానియా యూనివర్సిటీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సంయుక్తంగా ఏర్పాటు చేసే స్వతంత్ర నిపుణుల కమిటీకి నివేదించాలని 2024 జనవరి 1న ఆదేశించింది. నాలుగు వారాల్లోపు కమిటీ పరిశీలించి రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు సిఫార్సు చేయాలని, అలాగే నియామకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది.

దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 2024 జనవరి 24న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ నియామకాలు చేపడితే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరి 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ పిటిషన్‌పై విచారణ జరిగిన సుప్రీంకోర్టు ధర్మాసనం బోర్డు తీరును తప్పుబట్టింది. హైకోర్టు తీర్పు ప్రకారం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి రెండునెలల్లో మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే పూర్తైన 15,474 మంది అభ్యర్థుల నియామకాలను డిస్టర్బ్‌ చేయకుండా మిగిలిన 854 పోస్టుల నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయాలని పేర్కొంటూ ఎస్‌ఎల్‌పీని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.