
విద్యార్థులను ఎంతో కాలంగా టెన్షన్ కు గురిచేస్తున్న పరీక్షల కాలం రానే వచ్చేసింది. ఇప్పటికే కొన్ని తరగతుల వారికి ఎగ్జామ్స్ మొదలయ్యాయి. దీంతో స్టూడెంట్స్ లో మరింత ఆందోళన, యాంగ్జైటీ మొదలవుతుంటాయి. చదివించి గుర్తుపెట్టుకోవడం దగ్గరనుంచి ఎగ్జామ్స్ లో రాసేవరకు ఈ టెన్షన్ ఆగదు. అయితే, ఏడాదికాలంగా పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించే ఈ సమయంలో కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. వీటి కారణంగా మొదటికే మోసం ఏర్పడే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉండండి.
ఎలాగో పరీక్షలు మొదలైపోయాయి కాబట్టి రేపటి పరీక్షకు సంబంధించిన అన్ని వస్తువులను ఒక దగ్గర ముందే అమర్చి పెట్టుకోండి. ఒక్కో పరీక్షలో ఒక్కో విధమైన పరికరాలు అవసరం అవ్వచ్చు. వాటిని ముందే సిద్ధంగా ఉంచుకుంటే మరుసటి రోజు టెన్షన్ పడకుండా ఉంటారు. ముఖ్యంగా పెన్స్, హాల్ టికెట్స్, ఐడీ కార్డుల వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ఇప్పటి వరకు మీరు చదివిన విషయాలను ప్రశాంతంగా కూర్చును రివిజన్ చేసుకోండి. అంతేకానీ పరీక్షల ముందు కొత్త చాప్టర్లు, ఇప్పటివరకు టచ్ చేయని సిలబస్ జోలికి వెళ్లకండి. చదివినంత మేర పర్ఫెక్ట్ గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. పరీక్షల ముందు కొత్త టాపిక్స్ మీలో లేని పోని గందరగోళాన్ని నింపుతుంటాయి. ఇది మీ మొత్తం ప్రిపరేషన్ ను చెడగొడతాయి.
చాలా మంది విద్యార్థులు పరీక్షల సమయంలో చేసే ముఖ్యమైన పొరపాటు ఇదే. ప్రిపరేషన్ కోసం ఎక్కువ సేపు మేలుకుని తెల్లారే ఉరుకులు పరుగులతో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే మీ మెమరీ మొత్తం మీ నిద్ర మీదనే ఆధారపడి ఉంటుంది. ముందు రోజు సరిగా నిద్ర లేకపోతే ఎంత సులభమైన ప్రశ్నలొచ్చినా సరైన సమయంలో గుర్తుకు రాకుండా మీ బుర్ర ఇబ్బంది పెడుతుంది.
టైమ్ లేకనో, లేక మరో కారణం చేతనో పరీక్షల ముందు, పరీక్ష రోజున ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ ను తినకండి. కొన్ని సార్లు ఇది మీ పొట్టను డ్యామేజ్ చేసేస్తుంది. దీంతో మీరు పరీక్షలు సరిగ్గా రాయలేరు. కొన్ని సార్లు ఫుడ్ పాయిజన్ కు కూడా దారితీస్తుంది. అందుకే నూనెలు, మసాలాలు ఉన్న ఆహారాలకు ఈ కొన్ని రోజుల పాటు దూరంగా ఉండండి.
భయపడితే మీరేం సాధించలేరన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ అనవసర భయాలే విద్యార్థులను చిక్కుల్లో పడేస్తుంటాయి. ఎగ్జామ్ సెంటర్ కు అరగంట ముందుగానే వెళ్లిపోయి సిద్ధంగా ఉండండి. పరీక్షలో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేందుకు ప్రయత్నించండి. ఒకవేళ సాధ్యపడకపోయినా అధైర్యం వద్దు. మీపై నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లో కోల్పోకండి.