Aadhaar Authentication: ఇకపై SSC పరీక్షలన్నింటికీ ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.. ఈ ఏడాది మే నెల నుంచే అమలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో నిర్వహించే నియామక పరీక్షలకు సంబంధించి సరికొత్త విధానం అమలులోకి వచ్చింది. పరీక్షల్లో అభ్యర్ధులు అక్రమాలకు పాల్పడకుండా, మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి ఇకపై నిర్వహించే అన్ని పరీక్షలలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం (ఏప్రిల్ 20) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది. ఈ విధానం మే 2025 నుంచి నిర్వహించే అన్ని నియామక పరీక్షలకు అమలు చేయనున్నట్లు పేర్కొంది..

Aadhaar Authentication: ఇకపై SSC పరీక్షలన్నింటికీ ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.. ఈ ఏడాది మే నెల నుంచే అమలు
Aadhaar Authentication for SSC Exams

Updated on: Apr 21, 2025 | 10:27 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. కేంద్ర ప్రభుత్వంలోని అతిపెద్ద నియామక సంస్థల్లో ఒకటి. ఇది ప్రధానంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నాన్-గెజిటెడ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియలను నిర్వహిస్తుంది. కమిషన్‌ తాజా నిర్ణయంతో రాబోయే పరీక్షలలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణను అమలు చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం మే 2025 నుంచి కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్‌ వివరాలను పేర్కొనడంతోపాటు పరీక్ష రోజున పరీక్షా కేంద్రంలో హాజరయ్యేటప్పుడు ఆధార్‌ బయోమెట్రిక్‌ కూడా తీసుకుంటారు. తద్వారా అభ్యర్ధుల ప్రామాణీకరణ మరింత బలంగా ఉంటుందని కమిషన్‌ జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఆధార్ ప్రామాణీకరణ స్వచ్ఛందంగానే ఉంటుందని, అభ్యర్థులకు పరీక్షా ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఉద్దేశించబడిందని కమిషన్‌ స్పష్టం చేసింది.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ గుర్తింపులను నకిలీ చేయకుండా, SSC నియామక పరీక్షలకు హాజరు కావడానికి మోసపూరిత మార్గాలను ఉపయోగించకుండా నిరోధించేందుకు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ సహాయపడుతుందని అధికారులు వివరించారు. గత ఏడాది సెప్టెంబర్ 12న జారీ చేసిన నోటిఫికేషన్‌లో, కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ ప్రామాణీకరణను నిర్వహించడానికి కమిషన్‌ అనుమతి పొందింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏడు రకాలైన అఖిల భారత బహిరంగ పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. గత ఏడాది ఆగస్టు 28న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే పరీక్షలకు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ఆమోదించిన సమయంలో మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

కాగా దేశవ్యాప్తంగా SSC, UPSC నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతుంటారు. UPSC ఏటా 14 రకాల పరీక్షలను నిర్వహిస్తుంది. వాటిల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సివిల్ సర్వీసెస్ పరీక్ష. ఇది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లకు అధికారులను ఎంపిక చేస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ ‘A’ , గ్రూప్ ‘B’ పోస్టులకు ప్రవేశం కోసం ప్రతియేట పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.