న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి తుది అంకం మొదలైంది. దేహ దారుఢ్య సామర్థ్య పరీక్ష మరో 10 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో పరీక్ష తేదీలతో పాటు అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన జారీ చేసింది. దేహ దారుఢ్య సామర్థ్య పరీక్ష దేశవ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి ఫిజికల్ టెస్టులు ప్రారంభం అవుతాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. పీఈటీ, పీఎస్‌టీ పాసైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు.
దీంతో నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం రిజర్వేషన్ వారీగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. గతేడాది విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46,617 కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ)/ రైఫిల్‌మ్యాన్(జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. ఏప్రిల్‌లో ఆన్సర్ కీ విడుదల చేయగా.. దీనిపై అభ్యంతరాల స్వీకరణ పూర్తి చేసి, జులైలో రాత పరీక్ష ఫలితాలు విడుదల చేసింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పీఈటీ/ పీఎస్‌టీ అడ్మిట్‌కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.