
హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వచ్చే జనవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరిలో పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ పరీక్షలు ఎటువంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు అధికారులను సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమల్లో ఉన్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల కోసం చేపట్టిన చర్యలపై హైదరాబాద్‌లోని ఇంటర్‌బోర్డులో ఆయన సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా సీసీ టీవీ నిఘా వ్యవస్థ పనితీరును ఈ సమీక్షలో పరిశీలించారు.
విద్యార్థులు, సిబ్బంది హాజరును రియల్ టైమ్‌లో నమోదు చేసే ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానాన్ని అన్ని జూనియర్ కాలేజీల్లో సమర్థంగా అమలు చేస్తున్నందుకు ఆయన ప్రశంసించారు. ప్రతి నెలా మూడు రోజులపాటు ప్రత్యేక అధికారులు ప్రభుత్వ కళాశాలలను సందర్శించి హాజరు, స్టడీ అవర్స్, బోధనా విధానాలు, మౌలిక వసతులను పరిశీలిస్తున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డికి వివరించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.