UPSC Civils Topper 2025 Success Story: యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన గొర్రెల కాపరి కొడుకు.. బీరప్ప నువ్ గ్రేటప్ప!

కాలం కలిసి రాలేదని ఎంతో మంది నేలకు చారగిల పడి అసలు ప్రయత్నమే చేయడం మానుకుంటారు. కానీ కొందరు మాత్రమే విధికి ఎదురీది తమ కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు మన సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది గడ్డు పేదరికం అనుభవించే ఓ గొర్రెల కాపరి కొడుకు ఏకంగా ఎంతో కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మెరవడం మామూలు విషయం కాదుకదా..

UPSC Civils Topper 2025 Success Story: యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన గొర్రెల కాపరి కొడుకు.. బీరప్ప నువ్ గ్రేటప్ప!
UPSC Civils Topper

Updated on: Apr 27, 2025 | 6:33 AM

బెల్గావి, ఏప్రిల్ 27: ప్రతిష్టాత్మక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షల తుది ఫలితాలు ఏప్రిల్ 22న ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో పొరుగున ఉన్న మహారాష్ట్రలోని అమగే గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని అనే గొర్రెల కాపరి కుమారుడు 551వ ర్యాంకు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని నానావాడి గ్రామానికి చెందిన గొర్రెలు మేపే కురుబ వృత్తుల వారితో కలిసి బీరప్ప కుటుంబం కూడా గొర్రెలు కాసుకుంటూ బతుకుతోంది. అయినా బీరప్ప తండ్రి సిద్దప్ప దోని తన బిడ్డలను ఉన్నత చదువులు చదివించాడు. తండ్రి కష్టాన్ని చూసిన పిల్లలు కూడా పెద్ద కలలే కన్నారు. పెద్ద కొడుకు ఏకంగా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అన్న నుంచి ప్రేరణ పొందిన బీరప్ప కూడా ఆర్మీలోనే చేరాలనుకున్నాడు.

కానీ కొన్ని కారణాలవల్ల అందుకు దూరమయ్యాడు. బీటెక్‌ పూర్తి చేసిర బీరప్ప.. చివరకు పోస్టల్‌ జాబ్‌ కొట్టాడు. ఐపీఎస్‌ కావాలనే కలతో సివిల్స్‌ వైపు అడుగులు వేశాడు. లక్ష్యం కోసం పోస్టల్ జాబ్ వదులుకుని ప్రిపరేషన్‌ సాగించాడు. అలా ఈ ఏడాది మూడో అటెంప్ట్‌లో 551వ ర్యాంకు సాధించాడు. దేశంలోని అత్యంత కఠినమైన పోటీ పరీక్షలలో ఒకటిగా పరిగణించే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన బీరప్ప.. ఇప్పుడు రెండు గ్రామాల్లో పండగ వాతావరణానికి కారణమయ్యాడు. తన ర్యాంకింగ్, దరఖాస్తులో ప్రాధాన్యత ఆధారంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో చేరాలని బీరప్ప ఆశిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

అతని తండ్రి సిద్దప్ప దోని కొడుకు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. నా కొడుకు బీరప్ప ఏం చదివాడో, ఏం పరీక్ష రాశాడో నాకు తెలియదు. కానీ పెద్ద పోలీస్ అధికారి అవుతాడని మావాళ్లు చెబుతున్నారు. ఆర్మీ ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. ఇప్పుడు పోలీస్‌ అవుతున్నాడు. నాకు సంతోషంగా ఉంది’ అని తనకు తెలిసిన విధంగా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక బీరప్ప రాకతో నానావాడిలో వేడుకలు చోటు చేసుకున్నాయి. గ్రామస్తులు రోజూ గొర్రెలను మేపడానికి వాడే కొట్టంలోనే బీరప్పకు సన్మానం చేశారు. సమాజం యొక్క ఆశలను ఇలా వ్యక్తం చేశారు: “అతను బీరప్ప మంచి అధికారి కావాలని, తమ లాంటి పేద ప్రజలకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నామని బీరప్ప మామ యల్లప్ప గడ్డి అన్నారు. బీరప్ప విజయం మా సమాజం నుంచి మరింత మంది యువకులు, మహిళలు ఇటువంటి పరీక్షలకు హాజరు కావడానికి ప్రేరణనిస్తుందని అన్నారు.

కాగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) వంటి ఉన్నత సేవలకు అభ్యర్థులను ఎంపిక చేసే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రతి యేట లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే తుది జాబితాలో చోటు దక్కించుకుంటారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.